పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో యువకుడి దారుణ హత్య కేసుపై  సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో గ్యాంగ్‌స్టార్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. 24 గంటల్లోగా గ్యాంగ్‌స్టార్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. 
       

         

          అమృత్‌సర్ జిల్లా పండోరికి చెందిన మణ్‌దీప్ సింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా ఇద్దరు మోటార్ సైకిళ్లపై ఆటకాయించి కాల్పులు జరిపారు. ఎనిమిది రౌండ్ల కాల్పులు జరపడంతో మణ్‌దీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతనిని ఎవరు హత్య చేశారనే అంశంపై పోలీసుల విచారణ జరుగుతుండగానే సోషల్ మీడియాలో గ్యాంగ్‌స్టార్ పెట్టిన పోస్ట్ చర్చకు దారితీసింది. మేమే చంపాం.. మణ్‌దీప్ సింగ్‌ను హత్యచేసింది తామేనని గ్యాంగ్‌స్టార్ హర్విందర్ సింగ్ సందూ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 
     

 

            మణ్‌దీప్‌తో శత్రుత్వం ఉందని వివరించాడు. అందుకోసమే హత్యచేయాల్సి వచ్చిందని తెలిపారు. భవిష్యత్‌లో తమకు ఎదురుతిరిగిన వారిపై కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. 8 రౌండ్లు కాకుండా 25 రౌండ్లు, 100 రౌండ్ల కాల్పులు జరుపుతామని బెదిరించారు. ఇతరులు బుద్దిగా మెలగాలని సూచించారు. అంతేకాదు పోలీసులకు కూడా హుకుం జారీచేశాడు. ఈ కేసులో అమాయకులను ఇరికించొద్దని సూచించారు. హర్విందర్ పంజాబ్‌లోని బాటాలాకు చెందినవాడని పోలీసులు తెలిపారు. క్రమంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడని పేర్కొన్నారు. మణ్‌దీప్‌పై దాడిచేసిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు  తెలిపారు.
       

 

            గ్యాంగ్‌స్టార్ పోస్ట్ పోలీసులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఒక్కరోజులోనే దాడి చేసింది తానేనని గ్యాంగ్‌స్టార్ పెట్టడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఈ మేరకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా దాడులు జరిపింది తామేనని,  దాడులు చేసి, తామే చేశామని చాలా మంది చెప్పుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో నేరాన్ని అంగీకరించి హీరోలుగా భావించి  వారికి చాలా మంది అభిమానులుగా మారి, అనుచరులు అవుతున్నారని ఇది మంచిది కాదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: