ద్వంద్వ పౌరసత్వం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు షాక్ త‌గిలింది. చెన్నమనేని రమేష్‌ భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వంతో ఎమ్మెల్యేగా గెలవడంపై రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ 2009 నుంచి కోర్టుల్లో సవాల్ చేస్తున్నారు. ర‌మేశ్‌- ఆది శ్రీనివాస్‌ల మ‌ధ్య న‌లుగుతున్న కోర్టు కేసుల ప‌రంప‌ర‌లో భాగంగా, చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

 

చెన్నమనేని రమేశ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన 2009 నుంచి వివాదం న‌లుగుతోంది.  భారత పౌరసత్వంతో ఆయ‌న‌ గెలవడంపై రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ కోర్టుల్లో సవాల్ చేస్తున్నారు. నిజాలు దాచిపెట్టి గెలిచారని వాదిస్తూ వచ్చారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రెండు వర్గాలు పిటిషన్లు వేశారు. చెన్నమనేనికి కోర్టుల్లో గతంలో ఎదురుదెబ్బలు తగిలాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఎమ్మెల్యే శాసనసభ్యత్వాన్ని రద్దుచేసింది. దీనిపై రమేష్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రం నిర్ణయాన్ని 6 వారాల పాటు నిలుపుదల చేస్తూ కోర్టు గత జులై నెలలో ఉత్తర్వులిచ్చింది. రమేశ్ పౌరసత్వం వ్యవహారాన్ని మరోసారి సమీక్షించి...3 నెలల్లోపు తేల్చేయాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. దీంతో.. హోంశాఖకు రివ్యూ పిటిషన్ ఆది శ్రీనివాస్ అందించారు. ఈ క్రమంలో చెన్నమనేని రమేశ్ అక్టోబరు 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి తన వివరణ తెలియజేశారు. దీంతో పాటుగా ఆది శ్రీ‌నివాస్ సైతం త‌న వివ‌ర‌ణ అందించారు. ఈ వివ‌ర‌ణ ఆధారంగా...తుది నిర్ణ‌యం తాజాగా వెలువ‌డింది.

 

చెన్నమనేనికి జర్మనీ పౌర‌స‌త్వం కూడా ఉందని నిర్ధారించుకున్న హోంశాఖ పునఃసమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ చెన్నమనేని మోసపూరితంగా భారత పౌరసత్వాన్ని పొందారని తేల్చింది. అనేక వాస్తవాలు దాచి తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని నిర్థారించింది. చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పింది. తమ‌కు ఇరువ‌ర్గాలు స‌మర్పించిన స‌మాచారం ఆధారంగా...ఆయ‌న పౌర‌స‌త్వం ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్ణ‌యం వెలువ‌రించింది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ గెలుపు విష‌యంలో ఆది శ్రీ‌నివాస్ స‌వాల్ చేస్తే...ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: