ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక అంశంపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు.  ఏపీలో కనీస ఆదాయం లేని ఆలయాల స్థితిగతుల మీద పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.పాదయాత్ర సమయంలో తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల వారికి  తానిచ్చిన హామీల మేరకు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

          రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న ఆలయాల వివరాల్ని తెప్పిస్తున్న జగన్ సర్కారు ఇందులో ఏడాదికి రూ.50వేలు కూడా ఆదాయం రాని ఆలయాల వివరాల్ని సేకరించింది. ప్రభుత్వం చేపట్టిన కసరత్తులో ఇలాంటి స్థితిలో ఉన్న ఆలయాలు ఏకంగా 6709 ఉన్నట్లుగా గుర్తించారు. డిసెంబరు ఒకటో తేదీ వరకూ ఈ కసరత్తు సాగనుంది. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన వారు ఆలయాలకు వచ్చే ఆదాయానికి సంబంధించిన వివరాల్ని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది.

 

         అతి తక్కువ ఆదాయం వచ్చే ఆలయాలకు అండగా నిలవటంతో పాటు అందులో పని చేసే అర్చకులకు ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు వీలుగా, వారి జీతాల్ని భారీగా పెంచాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదాయం లేని చిన్న గుళ్లలో పని చేసే ఆర్చకులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏమేం చేయాలన్న అంశంపై సీరియస్ గా కసరత్తు చేస్తోంది.

 

         తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్చకులు సిబ్బంది వేతనాల్ని పెంచుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. దీనికి తగ్గట్లే తాజాగా చర్యలు చేపట్టింది. గతంలో ఇలాంటి గుళ్లను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న ఆలయాలకు ధూపదీప నైవేధ్యం పథకాన్ని అమలు చేశారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ పథకానికి మసకబారేలా చేశారు. నామ మాత్రపు నిధుల్ని కేటాయించటంపై ఆర్చక సంఘం అప్పట్లో తమ ఆవేదనను వ్యక్తం చేసింది. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల్ని పాదయాత్రలో జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

 

         తాజాగా ఈ అంశం మీద దృష్టి పెట్టిన జగన్ జిల్లాల వారీగా కనీస ఆదాయం లేని గుళ్ల వివరాల్ని సేకరించి.. వారి జీతభత్యాలతో పాటు.. ఆలయ నిర్వహణకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పుడు కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: