ఒకప్పుడు హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితమైన మజ్లిస్..ఈ పార్టీ ఇప్పుడు మెల్లగా దేశమంతటా విస్తరంచాలని అడుగులు వేస్తుంది . గత కొంత కాలంగా అసదుద్దీన్ ఓవైసీ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పార్టీ పోటీకి దిగుతోంది. మహారాష్ట్ర, బిహార్ అసెంబ్లీల్లోనూ ఈ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఉత్తర ప్రదేశ్‌‌లోనూ తన ఉనికి చాటింది. 

 

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచిన ఎంఐఎం.. పరోక్షంగా బీజేపీ-శివసేన కూటమి విజయానికి సహకరించింది. మహా ఎన్నికల సంగ్రామం తర్వాత.. అసదుద్దీన్ ఇప్పుడు బెంగాల్‌పై ఫోకస్ పెట్టారు.ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం బరిలో దిగడం వల్ల.. ముస్లింల ఓట్లు కాంగ్రెస్, మజ్లిస్ మధ్య చీలిపోయాయి. పరోక్షంగా ఇది బీజేపీ శివసేన కూటమికి ప్రయోజనం చేకూర్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రెండు సీట్లను గెలుపొందడంతోపాటు.. మొత్తంగా 7.37 లక్షల ఓట్లను సాధించింది.

 

 బీఎస్పీ, ఎస్పీ సాధించిన సీట్ల కంటే ఇది అధికం.బెంగాల్‌లో మజ్లిస్ పోటీ చేయనుందనే వార్తలతో తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రం బెంగాల్. పశ్చిమ బెంగాల్‌ ఓటర్లలో 27 శాతం ముస్లింలే. వీరంతా ఇప్పటి వరకు మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీకి మద్దతు ఇస్తున్నారు. 


వామపక్షాలకు కంచుకోట లాంటి బెంగా‌ల్‌లో 2011లో దీదీ జెండా ఎగరేయడానికి ప్రధాన కారణం ముస్లింలు టీఎంసీకి అండగా నిలవడమే.బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. దాదాపు 90 స్థానాల్లో ముస్లిం ఓటర్లు  ఎక్కువ. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీఎంసీ దాదాపుగా అన్ని స్థానాలనూ టీఎంసీ గెలుపొందింది. 2021లో ఎన్నికల్లోనూ.. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాల్లో తేలిగ్గా గెలవొచ్చనే ధీమాలో దీదీ ఇప్పటి వరకూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: