తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో గెలిచిందేవరో.. ఓడిందెవరో అర్థం కాని పరిస్థితి. సీఎం కేసీఆర్ దూకుడును అంచనా వేయలేని యూనియన్లు సమ్మె చేయాల్సింది పోయి పోరాటం చేశాయి. సమ్మెతో మొదలై.. పోరాటంగా సాగి.. చివరికి కోర్టు సూచనలతో విధుల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. 2005 నాటి సమ్మెలో కూడా ఇంతే తీవ్రత ఉన్నా కొంతమేర పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి పరిస్థితి మాత్రం పూర్తిగా వేరనే చెప్పాలి.

 

తెలంగాణ రాష్ట్రం కోసం జరిపిన సకలజనుల సమ్మె తర్వాత అంత సుదీర్ఘంగా జరిగిన సమ్మె ఇది. 47 రోజుల పాటు అనేక ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య సమ్మె కొనసాగింది. నిజానికి ఈ సమ్మె ఇలా జరుగుతుందని కార్మిక సంఘాలు ఊహించి ఉండవు. సీఎం కేసీఆర్ ఎంట్రీతో పరిస్థితులు తారుమారయ్యాయి. మొత్తానికి హైకోర్టు తుది తీర్పుపై సమీక్షించుకుని సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. షరతులు లేకుండా కార్మికులను విధుల్లో చేర్చుకుంటేనే సమ్మె విరమిస్తామని.. కార్మికులు ఎలాంటి పేపర్లు, షరతులపై సంతకాలు పెట్టరని అన్నారు. హైకోర్టు తీర్పును ఇరుపక్షాలు గౌరవించాలన్నారు. ఆర్టీసి భవన్ లో యూనియన్లతో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

 

2014లో సమ్మె తీవ్రత పెరిగాక ఫిట్ మెంట్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈసారి మాత్రం ఢీ కొట్టారు. అనేక అల్టిమేటమ్స్ జారీ చేశారు. ఆర్టీసీనే లేకుండా చేస్తామన్నారు. రూట్ పర్మిట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా యూనియన్లకు అవకాశం ఇవ్వలేదు. చివరకు యూనియన్లు కోర్టును ఆశ్రయించే పరిస్థితులు కల్పించారు. యూనియన్లు తమ డిమాండ్ల సాధనకు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రభుత్వంలో విలీనం అంశం ప్రస్తుతానికి పక్కకు పెట్టారు. అనుకోని దురదృష్టకర సంఘటనలు బాధించేవే. ఇన్ని మలుపులు మధ్య.. సుదీర్ఘ సమ్మెలో విజయమెవరిది.. సాధించింది ఎవరు.. అనే ప్రశ్నలకు సమాధానం.. సశేషం అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: