పూసపాటి అశోక గజపతి రాజు" తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఉన్న అతికొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు. రాజకీయంగా జిల్లాలో టీడీపీ ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉంది అంటే అది ఆయన చలువే. అందుకే చంద్రబాబు వద్ద కూడా ఆయనకు ఎక్కువ చనువు ఉంటుంది. చంద్రబాబు సమకాలీకుడు కావడంతో జిల్లాలో ఆయన వద్దకే అన్ని పంచాయితీలు వచ్చేవి. సీట్ల ఎంపిక నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆయనే చూసేవారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత బాధ్యతలను తన కుమార్తెకు అప్పగించారు.

 

2019 ఎన్నికల్లో ఆయన మరోసారి ఎంపీగా ఆయన... కుమార్తె ఎమ్మెల్యే గా విజయం సాధిస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఇద్దరు ఓటమి పాలయ్యారు. విజ‌య‌న‌గ‌రం ఎంపీగా పోటీ చేసిన అశోక్ చాలా జూనియ‌ర్ అయిన బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ చేతిలో ఓడిపోయారు. అతిథి విజ‌య‌న‌గ‌రం అసెంబ్లీకి పోటీ చేసి కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక ఇక్కడి నుంచి ఇద్దరు పార్టీ సమావేశాల్లో కనపడటం లేదు.

 

ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు వెళ్లినా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇందుకు అశోక్ గజపతి రాజు అనారోగ్యం కారణమని చెప్పినా కనీసం కుమార్తె కూడా రాలేదని అంటున్నారు. జిల్లాలో కార్యకర్తల్లో భయాలు ఉన్నాయి... ఆ భయాలను కూడా వాళ్ళు ఎన్నికల తర్వాత తొలగించే ప్రయత్నం చేయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. కనీసం స్థానిక నాయకత్వానికి కూడా ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేరని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ లోకి వెళ్తారని వార్తలు కూడా వస్తున్నాయి.

 

చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేత పార్టీ మారితే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో ఆయన్ను మించిన నేత మరొకరు లేరని రాజకీయ వర్గాలు కూడా అంటాయి. అలాంటిది ఆయన కుటుంబమే దూరంగా ఉంటే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు... ఇప్పటికైనా బయటకు వచ్చి ఆయన కుమార్తె గాని ఆయన గాని కార్యకర్తలకు అండగా నిలవాలని అభిమానులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: