ప్రభుత్వ అంచనాల కమిటీ కి చాలా బాధ్యత ఉంటుందని అంచనాల కమిటీ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం సభ్యుల పైన ఎంతైనా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శాసన సభ కమిటీ హాల్ లో జరిగిన అంచనాల కమిటీ మొదటి సమావేశంలో  శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి శాసన సభ కార్యదర్శి నర్సింహా చార్యులు లు పాల్గొన్నారు. ప్రభుత్వం చేస్తున్న  ఖర్చులు, పొదుపు గురించి సంపూర్ణ ముగా అవగాహన ఉండాలని, వాటి వినియోగము ఎలా జరుగుతుందో   చూడాల్సిన బాధ్యత కూడా ఈ అంచనాల కమిటీ కి ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు . పార్లమెంట్ లో ఈ కమిటీ కి అత్యంత ఉన్నత స్థానం ఉంటుందని, ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని గుతా చెప్పారు. పరిపాలన పరంగా ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, వాటిపైన ఆడిట్ ను కూలంకషంగా   అంచనాల కమిటీ అధికారులు పరిశీలన  చేయాలని సూచించారు. 

 

శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అవి ఎలా ఉపయోగ పడుతున్నాయి, వాటిని పొదుపుగా ఏవిధంగా ఖర్చు చేయవచ్చు అనే అంశాలపై కూడా అంచనాల కమిటీ సమీక్ష చేయవచ్చని  తెలిపారు . ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేందుకు నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ అంచనాల కమిటీ నిరంతరం జాగ్రత్తలతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

 

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...అంచనాల కమిటీ ప్రధానంగా అన్ని నివేదికలను కూలంకషంగా పరిశీలించాలని అవసరమైతే గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒక పథకానికి  బడ్జెట్లో  పెడుతున్న ఖర్చు ఆ తర్వాత అంచనా కి మధ్య తేడా వస్తుందని ఇది ఎందుకు వస్తుందో పరిశీలించాల్సిన అవసరం  ఉందని అన్నారు.  ఒక పనికి ఒక బడ్జెట్లో కేటాయించిన దానికి ఆ పని పూర్తయిన తర్వాత ఖర్చు లో తేడా వస్తుందని, ఒక శాఖ  కేటాయించిన బడ్జెట్ కి మరో శాఖ కేటాయించే దానికి మధ్య చాలా వ్యత్యాసం వస్తుందని దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.

 

అంచనాల కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సోలిపేట రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పనులు చేసి అంచనాల కమిటీ బాధ్యతను తాము అన్ని విధాల అందరికీ అవసరము అయ్యే విధంగా చూస్తామని అన్నారు. ప్రజల ఆర్థిక వనరులను కాపాడే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంచనాల కమిటీ సభ్యులు కోనేరు కోనప్ప, ఆకుల లలిత, రియాజుల్ , బాలసాని లక్ష్మీనారాయణ, జయప్రకాష్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జాజుల సురేందర్, మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: