చిన్నప్పుడు బుడ్డ పొరగాళ్లని కూర్చో పెట్టుకుని గాళి ముచ్చట్లు నాలుగు చెప్పుకుంటుంటే అందులో ఉన్న ఓ పోరడు నేను కూడా రాజై రాజ్యాన్ని ఏలుతా, పెద్ద పెద్ద మేడలు కట్టి అందరు సంతోషంగా ఉండేలా పరిపాలిస్తా అన్నాడట. కాని వాడు పెద్దైయ్యాక పాలేరు అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో జరిగింది ఇదే. ఎవరి లాభం కోసం 48 రోజులు సమ్మె చేసినట్లు?. ఎవరికి లొంగి సమ్మె విడిచి పెట్టినట్లు?, సమ్మె వల్ల ఏం ఒరిగిందని?, సమ్మె వల్ల కార్మికులకు ఏం లాభం జరిగిందని?.

 

 

దాదాపుగా 23 మందివరకు ప్రాణాలు విడిచారు. సమ్మె ఇప్పుడు ఆపేసారు. పోయిన ప్రాణాలు వస్తాయా? రోడ్డున పడ్డ వారి కుటుంబాలకు న్యాయం ఎవరు చేస్తారు? ఈ సమ్మె వల్ల ఆడవాళ్ళ తాళి బొట్లు తెగిపోయాయి?. వారి పిల్లలు తండ్రి లేని అనాదలయ్యారు?. ఇన్ని రోజులు పోరాడింది దీని కోసమేనా? ఇంతమంది మరణానికి ఫలితం ఇదేనా? ఈ సమ్మెలో విజయం ఎవరు సాధించినట్లు?,

 

 

నష్టం జరిగింది ఎవరికి ? అని విశ్లేషించుకుంటే ప్రజలే చాలా నష్టపోయినట్లు. ఎందుకంటారా? ఆర్టీసీ మళ్లి నడవడం మొదలుపెడితే ఛార్జీల మోత మోగకుండా ఉంటుందా?. ఆ నష్టాన్ని పూడ్చాలంటే తిరిగి ప్రజలనుండి దోచుకోక తప్పుతుందా?. ఇదేకాకుండా కార్మికులు 48 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవడం ఇదంతా దేనికి సంకేతమో ఆలోచిస్తున్నారా?

 

 

రెండు నెలలుగా జీతాలు లేక కార్మికుల జీవితాలను ఆగమాగం చేసింది ఆ సమ్మె. గతంలో కూడబెట్టిన అరకొర సొమ్ములు కూడా సమ్మె కాలంలో కరిగిపోయాయి. నిత్యావసరాలు, పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత, ఆస్పత్రి తదితర ఖర్చులు భారమై కార్మికులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

 

 

గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కార్మికులు రోజువారీ కూలీలుగా అవతారమెత్తారు. మరి కొంత మంది కుల వృత్తులను నమ్ముకున్నారు. ఇప్పటి వరకు జీతాలు అందక జీవితాల్లో అల్లకల్లోలం చెలరేగగా దిక్కులేనివారిగా మారిన కార్మికులకు మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో ఎక్కువ మంది కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

 

 

మరోవైపు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా, కూడా ప్రభుత్వం ఒక్క డిమాండ్‌కు అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని.. తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని మరి కొంత మంది కార్మికులు అభిప్రాయపడినట్లు సమాచారం.

 

 

మొత్తం మీద ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాని ఇన్నిరోజులు ఆగకుండా సమయస్పూర్తితో వ్యవహరించి ముందే సరైన నిర్ణయం తీసుకుంటే కార్మికుల బ్రతుకులు ఇంతగా దిగజారకపోవును అని ప్రజలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: