జగన్ విషయంలో చూసుకుంటే అన్న నందమూరి తారక రామారావుతో పోలిక చాలా  ఉంది. ఇద్దరికీ పట్టుదల ఎక్కువ. అది గిట్టని వారికి మొండితనంగా కనిపిస్తాయి. ఇక ఇద్దరూ ఆత్మ గౌరవం ఎక్కువగా కలిగిన వారు. ఏదైనా కష్టపడి సాధించుకోవాలనుకుంటారు. ఎంగిలి కూడుకు అసలు ఆశపడరు. ఏదైనా జనంలోనే తేల్చుకోవాలనుకుంటారు. ఈ ఇద్దరు నేతలకు వారి మీద, జనం మీద అంత నమ్మకం.

 

ఇదిలా ఉండగా ఏపీ రాజకీయాల్లో మరో మారు ఎన్టీయర్ ప్రస్తావన వస్తోంది. అసలు ఈ ప్రస్తావనకు అంకురార్పణ చేసింది వైఎస్సార్ ఫ్యామిలికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ విషయంలో  ఆయన ఎన్టీయార్ తో తొలిసారిగా పోలిక తెచ్చారు. అన్న గారికి కూడా బంపర్ మెజారిటీ వచ్చిన తొమ్మిది నెలల్లోనే  సర్కార్ కూల్చేశారని ఉండవల్లి ఆ మధ్య మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. జగన్ జాగ్రత్తపడాలని కూడా అపుడే హెచ్చరించారు.

 

ఇపుడు రాజకీయాలు చూస్తూంటే  జగన్ విషయంలో విపక్షాలు కత్తి కట్టాయనిపించకమాందదు. ఎన్నడూ లేనిది మూడు ప్రధాన పార్టీలు బీజేపీ గొంతుతోనే మాట్లాడుతున్నాయి. మతం కార్డుని తీసి మరీ జగన్ని టార్గెట్ చేస్తున్నాయి. జగన్ క్రిస్టియన్ అంటూ దాడి చేస్తున్నాయి. నిజానికి జగన్ తాత రాజారెడ్డి కాలం నుంచే వారు క్రిస్టియన్లు. ఆ సంగతి తెలిసే వైస్సార్ ని దేవుడిగా జనం భావించారు. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు.

 

జగన్ విషయం తీసుకున్నా ఆయన్ని పదేళ్ళలోనే సీఎం పీఠానికి చేర్చి మొత్తానికి మొత్తం ఏపీని వూడ్చిపెట్టాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు జగన్ మీద ప్రయోగిస్తున్న ఈ అస్త్రంతో ఆయన్ని బలహీనున్ని చేయాలని, సర్కార్ ని అస్థిర పరచాలన్న కుట్ర జరుగుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే కొత్త ఏడాదిలో జగన్ మీద పొలిటికల్ ఎటాక్ రంగం సిధ్ధం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 

 


మరి జనాన్ని నమ్ముకున్న జగన్ ఎక్కడా తగ్గరన్న మాట కూడా ఉంది. జగన్ కనుక గట్టిగా నిలబడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో వూహించనక్కరలేదు. ఏపీలో ఎన్టీయార్ తరువాత అంతటి ప్రజాకర్షణ కలిగిన నేత జగన్ ముఖ్యమంత్రిగా  ఉన్నారు. ఇక కేంద్రంలో ఇందిరాగాంధీ తరువాత అంతటి బలమైన నేత మోడీ ప్రధానిగా  ఉన్నారు. చూస్తూంటే 80 దశకం నాటి రాజకీయమే మళ్ళీ  కళ్ళ ముందు కనిపిస్తోంది. మరి జగన్ విషయంలో ఏం జరగబోతోంది. అంతటి సాహసానికి ఎవరైనా ఒడిగడతారా. అలాంటి పరిస్థితే వస్తే ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయి. చూడాలి మరి 

మరింత సమాచారం తెలుసుకోండి: