పోగరు తలకెక్కి, కైపు తైతక్కలాడితే పందిని చూసి నంది అన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు ఇలాగే జరిగింది. అతను చేస్తున్నది బాధ్యతగల ఉద్యోగం. నలుగురికి ఆదర్శంగా ఉన్నతంగా ఉండవలసిన వ్యక్తి...

 

 

కాని చట్టం అతని చుట్టమైనట్లుగా సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే అలాంటి వాన్ని ఏమంటారు?. అందుకే తాగితే తల్లి పెళ్లమంటారనే సామేత ఊరికే రాలేదనిపిస్తుంది ఇతను చేసిన పనిని చూస్తే.

 

 

ఇక చిత్తూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. అదేంటో తెలుసుకుంటే. చిత్తూరులోని విష్ణుభవన్‌ హోటల్‌లో ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ రవిచంద్ర వీరంగం సృష్టించాడు.

 

 

అతను హోటల్ యజమానిని దుర్భాషలాడుతూ చేతికందిన వస్తువులను విసిరి కొట్టాడు. యజమానిపై దౌర్జన్యానికి దిగడంతో సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఊగిపోతున్న రవిచంద్ర హోటల్ సిబ్బందిపై చేయిచేసుకుని గందరగోళం సృష్టిస్తూ, వీధి రౌడీలా ప్రవర్తించాడు.

 

 

దీంతో హోటల్‌కి వచ్చిన కస్టమర్లు భయంతో పరుగులు తీసారు. అధికారం చేతిలో ఉంటే ప్రవర్తించే పద్దతి ఇదేనా అని అక్కడివారు పశ్నిస్తున్నారు. అంతే కాకుండా ఆ పోలీస్ కానిస్టేబుల్ ఫుల్లుగా మందు కొట్టి దౌర్జన్యానికి దిగిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

అతను హోటల్‌లో దూరి వస్తువులను చిందరవందర విసరడం.. యజమానిపై దాడికి పాల్పడడం వంటి చర్యలను చూస్తున్న వారికి అతను పోలీస్‌లా కనిపించడం లేదంటున్నారు. ఒక వీధిరౌడీ కూడా ఇంత అసహ్యంగా ప్రవర్తించడు అని అనుకుంటున్నారట.

 

 

మరోవైపు పోలీసు శాఖకు తలవంపులు తెచ్చేలా ప్రవర్తించిన కానిస్టేబుల్ రవిచంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ తతంగాన్ని చూసిన సామాన్యులూ.. ఇకపోతే తప్పు చేసిన వారిని దండించవలసిన ఆ చేతులు తప్పుడు పనులు చేస్తుంటే లోకంలో న్యాయం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు  కొందరు?

 

మరింత సమాచారం తెలుసుకోండి: