నిరవధిక సమ్మె పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు చేసిన 47 రోజుల సమ్మె వల్ల సంస్ధ పరిస్ధితి బాగా దిగజారిపోయింది. సంస్ధ యాజమాన్యం వర్గాలు చెప్పే లెక్కల ప్రకారమైతే సుమారు రూ 200 కోట్లు సమ్మె వల్ల  నష్టం జరిగిందట. ఆర్ధిక నష్టం ఒక ఎత్తైతే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళ మాటేమిటి ? పోని ఇన్ని రోజులు సమ్మె చేసిన తర్వాత సాధించిందేమిటి ? ఏమిటంటే ఏమీలేదనే సమాధానం చెప్పుకోవాలి.

 

47 రోజుల నిరవధిక  సమ్మె విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే తమ డిమాండ్లు సాధించుకునే సత్తా ఉంటేనే సమ్మె మొదలుపెట్టాలి. లేకపోతే యాజమాన్యాన్నో లేకపోతే ప్రభుత్వాన్నో బ్రతిమలాడుకుని తమ డిమాండ్లు సాధించుకోవాలి. కానీ ఇక్కడ జరిగిందేమిటి ? తమను తాము ఎక్కువ అంచనా వేసుకున్న యూనియన్ నేతలు కేసియార్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారు.

 

కేసియార్ వ్యవహార శైలి ఏంటో పూర్తిగా తెలిసిన నేతలు కూడా ప్రభుత్వంతో వార్ అన్న పద్దతిలోనే సమ్మె మొదలుపెట్టారు. దాంతో కేసియార్ కూడా సమ్మెను లెక్క చేయటం మానేశారు. ఏపిలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా తెలంగాణాలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో మొదలైన సమ్మె చివరకు ఫెయిల్యూర్ గా నిలిచిపోయింది.

 

అసలు ఏపి-తెలంగాణా పోలిక తేవటమే యూనియన్లు చేసిన తప్పు. జగన్ మనస్తత్వం వేరు కేసియార్ పద్దతి వేరు. ఇద్దరి మనస్తత్వాలు బాగా తెలిసిన ఆర్టీసి యూనియన్ నేతలు కూడా కేసియార్ కు జగన్ తో పోలిక తెచ్చారు. దాంతో కేసియార్ కు మండిపోయింది. అప్పటి నుండి యూనియన్లన్నా, సమ్మెన్నా పెట్రోలు పోసినట్లు భగ్గున మండిపోతున్నారు.

 

మొత్తం మీద వందల కోట్లు నష్టపోయి 20 మంది ఉద్యోగులు మరణించిన తర్వాత సమ్మె ఉపసంహరించుకోవాల్సొచ్చిది.  కొన్ని దశాబ్దాల పాటు సమ్మె అన్న మాటే వినబడకుండా పనిచేస్తే కానీ ఈ సమ్మె వల్ల జరిగిన నష్టం భర్తీ కానంతగా సంస్ధ పరిస్ధితి దిగజారిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: