టీఆర్ఎస్ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్  భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. సిటిజన్ షిప్ యాక్ట్ 1995లోని సెక్షన్ 10కింద చెన్నమనేని పౌరసత్వాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మోసపురితంగా భారత పౌరసత్వం పొందారంటూ హోమ్ శాఖకు ఆది శ్రీనివాస్  ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి భారత పౌరసత్వంపై  పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా చెన్నమనేనికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. భారత పౌరసత్వానికి అనర్హుడంటూ హోంశాఖ ప్రకటించింది.

 

ఈ నేప‌థ్యంలో పౌరసత్వ పరిరక్షణకు మళ్ళి హైకోర్టును ఆశ్రయిస్తాన‌ని చెన్నమనేని రమేష్ ప్ర‌క‌టించారు. జూలై 15, 2019 హైకోర్టు తీర్పు ఖచ్చితమయిన ఆదేశాలను హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమ‌న్నారు. ``నా పౌరసత్వాన్ని 2017లో హోంశాఖ రద్దు చేసిన తరువాత నాకు వెంటనే స్టే ఇచ్చిన హైకోర్టు సుధీర్ఘ‌ వాదనల తరువాత మొన్న జూలై 15, 2019 నాడు నా పౌరసత్వ రద్దును కొట్టివేసింది. పౌరసత్వ చట్టం, వాటి నిబంధనలు, నియమాలను, దరఖాస్తులను సమగ్రంగా, హేతుబధ్ధంగా, నైతికవిలువలను, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని తన 25 పేజీల సుదీర్ఘ‌ తీర్పును ప్రకటిస్తూ, హోంశాఖ వీటన్నింటిని పరిగణ లోకి తీసుకొని తన నిర్ణ‌యం తీసుకోవాలని ఆదేశించింది. ఇదే హైకోర్టు మా రిట్ అప్పీలుపై స్పందిస్తూ ఒక వేళ (సెక్షన్ 10.3) పరిగణించకుండా ఏ నిర్ణ‌యం వచ్చినా, న్యాయం కోసం మళ్లీ మా వద్దకు రావచ్చని తేల్చి చెప్పింది. ఈ హైకోర్టు ఆదేశాల మేరకే అక్టొబరు 31 నాడు ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికి హైకోర్టు తీర్పు ఖచ్చితమయిన ఆదేశాలను హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం. పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం, తప్పక నాకు న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకముంది.`` అని చెన్నమనేని రమేష్  ప్ర‌క‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: