తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆప్తుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్‌కుమార్ `గ్రీన్ ఇండియా చాలెంజ్‌` ప‌రిధి విస్త‌రిస్తోంది. ఈ చాలెంజ్‌లో భాగంగా సినీనటుడు కృష్ణ మంగళవారం మూడు మొక్కలు నాటారు. అనంతరం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, విక్టరీ వెంకటేశ్‌కు మూడేసి మొక్కలను నాటాలని హరిత సవా ల్ విసిరారు. ఇదే ఒర‌వ‌డిలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పీఠ ప్రాంగణంలో 3 రుద్రాక్ష మొక్కలు నాటారు.


శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మొక్క‌లు నాటిన‌ అనంతరం ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తమిళనాడుకు చెందిన దినమాలర్ పత్రికాధినేత ఆర్ఆర్ గోపాల్ జీ, విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, ప్రముఖ వ్యాపారవేత్త క్రిమ్ స్టోన్ అధినేత విరేన్ షాకు హరిత సవాల్ విసిరారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ..ప్రస్తుత జీవరాశులను రక్షించుకోవాలన్నా..మానవజాతి మనుగడను కొనసాగించాలన్నా పచ్చదనంతో కూడిన కాలుష్యరహిత వాతావరణం చాలా అవసరమన్నారు. దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ అనే గొప్ప కార్యక్రమం ఎంతోమందిని ఆకర్షితులను చేస్తోందన్నారు.

 

కాగా, సూప‌ర్ స్టార్ కృష్ణ నానక్‌రామ్‌గూడలోని త‌న‌ స్వగృహం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్, ఇగ్నైటింగ్ మైండ్స్ ప్రతినిధి రాఘవ, మనం సైతం కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించి మూడు మొక్కలునాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌చాలెంజ్‌లో నాటే మొక్కల సంఖ్య త్వరలో పదికోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రీన్ చాలెంజ్ అనే గొప్ప కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: