మాజీ సీఎం చంద్రబాబు తాజాగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వరుస కేసులతో చింతమనేని ప్రభాకర్ దాదాపు 2 నెలలు జైల్లోనే గడపారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అయితే చంద్రబాబు వైఖరిని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.

 

 

చింతమనేని గత చరిత్రను గుర్తు చేస్తూ..ఇలాంటి నేత ఇంటికి వెళ్లి పరామర్శించడం ద్వారా చంద్రబాబు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహశీల్దార్‌పై దాడి చేసిన చింతమనేని ప్రభాకర్‌పై 18 కేసులు నమోదు అయ్యాయని, రౌడీ షీట్ ఓపెన్‌ చేశారని, అలాంటి నేతను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అంటున్నారు.

 

దెందులూరు బాబాకు కరకట్ట బాబా మద్దతివ్వడం బాధాకరమంటున్నారు. మా పార్టీలోకాని, వేరే పార్టీలో కాని ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకెళ్తుందంటున్నారు. చంద్రబాబు తప్పులు చేస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని గుర్తు చేస్తున్నారు. తప్పు చేసిన చింతమనేనిని దండించాల్సింది పోయి ..నీవు ఇంద్రుడివి, చంద్రుడివి అంటూ యనమల రామకృష్ణుడు పొగడటం ఏంటని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.ఇలాంటి వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, స్పీకర్‌గా ఉన్న సమయంలో ఎన్‌టీఆర్‌కు ఎలాంటి మోసం చేశారో చూశామన్నారు.

 

చంద్రబాబు పోలీసులను సైతం బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బెదిరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి, పోలీసులను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు..ఈ రోజు గతంలో తాను చేసిన తప్పులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాన్ని తప్పు అంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.గతంలో అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తే పోలీసులు చూసి చూడనట్లు ఉండాలా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: