దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రారంభిస్తున్నాయి. అసోం ప్రభుత్వం అమ్మాయిలను చదువు దిశగా ప్రోత్సహించడం కొరకు, బాల్యవివాహాలను ఆపేందుకు సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. అసోం రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికి 10 గ్రాముల బంగారం కానుకగా అందించే విధంగా కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 
అసోం ప్రభుత్వం ఈ పథకానికి అరుంధతి బంగారు పథకం అనే పేరు పెట్టింది. నిన్న అసోం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించటంతోపాటు పథకానికి సంబంధించిన విధివిధానాలను కూడా వెల్లడించింది. అయితే ప్రభుత్వం బంగారాన్ని డైరెక్ట్ గా ఇవ్వదు. మార్కెట్ లో బంగారం ఖరీదును బట్టి వధువు అకౌంట్ లో ప్రభుత్వం నగదు రూపంలో జమ చేయనుంది.  ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో బంగారం ఖరీదును బట్టి ప్రతి సంవత్సరం ఇచ్చే నగదులో మార్పులు జరుగుతాయి. 
 
అసోం రాష్ట్ర ఆర్థిక మంత్రి 2020 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుండి ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తరువాత అసోం రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి అర్హులు కావాలంటే వధువు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు, వరుడి కనీస వివాహ వయస్సు 21సంవత్సరాలు ఉండాలి. 
 
కనీసం 10వ తరగతి వరకు వధువు తప్పనిసరిగా చదువుకొని ఉండాలి. 5 లక్షల రూపాయలకంటే తక్కువగా వధువు కుటుంబ వార్షికాదాయం ఉంటే మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈ పథకం అసోం రాష్ట్రంలో సక్సెస్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా అసోం రాష్ట్రాన్ని అనుసరించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించటం పట్ల అసోం రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం 10వ తరగతి వరకు చదువుకున్న అమ్మాయిలు మాత్రమే ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా పేర్కొనటంతో అసోం రాష్ట్రంలో చదువుకునే అమ్మాయిల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: