తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. జేఏసీ నేతలు ప్రభుత్వం కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేశారు. హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని లేబర్ కోర్టులో న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. 
 
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సత్వరమే ఆ దిశగా చర్యలు చేపడుతాయనే నమ్మకం తమకుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 48 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సంక్షోభానికి ముగింపు పడినట్లే అని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రాథమికంగా ఆర్టీసీ కార్మికులకు కొన్ని షరతులు పెట్టి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీఆర్ఎస్ ఆప్షన్ కూడా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. 
 
మెజారిటీ కార్మికులకు ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించి బయటకు పంపించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కార్మికులకు విధించే షరతుల్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కీలకమైన షరతును విధించే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల పాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయకుండా షరతును కూడా ప్రభుత్వం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను సమ్మె కాలానికి జీతం అడగొద్దన్న షరతును కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. షరతులకు ఒప్పుకునే వారిని మాత్రమే ప్రభుత్వం విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. లేబర్ కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం షరతులకు ఒప్పుకోని కార్మికుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది . జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరినప్పటికీ ప్రభుత్వం మాత్రం షరతులు విధించకుండా విధుల్లోకి తీసుకోవటానికి అంగీకరించే అవకాశమే లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: