పార్టీ, పాలనా వ్యవహరాల్లో జగన్మోహన్ రెడ్డికి కుడి, ఎడమలుగా ఉన్న ఇద్దరు ఎంపిలపై ఎల్లోమీడియా కుట్ర మొదలుపెట్టినట్లు  అనుమానంగా ఉంది. పార్టీ తరపున గెలిచిన మిథున్ రెడ్డి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డితో పాటు జగన్ కు వ్యతిరేకంగా మిగిలిన ఎంపిలను రెచ్చగొడుతున్నట్లే అనిపిస్తోంది. రెండు మూడు రోజులుగా జగన్ పై ఎంపిలు మండిపోతున్నారని, తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారనే కథనాలను వండి వారుస్తోంది. అదికూడా మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురిస్తుండటంతో కుట్ర కోణంపై అనుమానం పెరిగిపోతోంది.

 

ఇంతకీ కథనంలో ఏముందంటే ఉండటానికి పార్టీ తరపున 24 మంది ఎంపిలున్నా కేవలం విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డికి మాత్రమే అధిక ప్రాధాన్యత దక్కుతోందంటూ చాలామంది ఎంపిలు మండిపోతున్నారట. ఎందుకు మండుతున్నారంటే వయసులోను, అనుభవంలోను తమకంటే చిన్నవాడైన మిధున్ రెడ్డి అదుపాజ్ఞల్లో తాము పని చేయాలా ? అని ఎంపిలు ప్రశ్నిస్తున్నారంటూ కథనం అచ్చేశారు.

 

ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిన విషయం ఏమిటంటే వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంపిల్లో 17 మంది మొదటిసారి గెలిచిన వారే. వీరిలో అత్యధికులు రాజకీయాలకే కొత్త. కాబట్టి వయసు రీత్యా మిధున్ కన్నా పెద్దవారు అయ్యుండచ్చేమోకానీ అనుభవం మాత్రం శూన్యమే. ఎందుకంటే మిథున్ రెండోసారి గెలిచారు. పైగా ఇపుడు గెలిచిన వారి గెలుపులో మిథున్ పాత్ర కూడా ఉంది.

 

ఇక మిథున్ కన్నా సీనియర్ అంటే ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాత్రమే. మచిలీపట్నం ఎంపి బాలశౌరి మూడుసార్లు పోటిచేసినా రెండుసార్లే గెలిచారు. కడప ఎంపి అవినాష్ రెడ్డి  రెండోసారి ఎంపి అయ్యారు. కాకినాడ ఎంపి వంగా గీత గతంలో రాజ్యసభ ఎంపిగా చేసినా లోక్ సభకు గెలవటం ఇదే తొలిసారి.

 

పై వివరాల ప్రకారం తమకన్నా అనుభవంలో మిథున్ చిన్నవాడే అని చాలామంది ఎంపిలు అనుకోవటం ఉత్త కట్టుకథే అనిపిస్తోంది. ఇక ఎంఎల్ఏలకిస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వటం లేదని అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పింది. రాష్ట్రప్రభుత్వానికి సంబంధించి ఎంఎల్ఏలకే తొలి ప్రాధాన్యత అన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రమే ఎంపిలకు ప్రాధాన్యత ఉంటుంది.

 

పైగా ప్రతి కమిటిలోను విజయసాయిరెడ్డి, మిథునేనా సభ్యులు ? అని మండిపోతున్నారట. ప్రతి ఎంపిని పార్లమెంటరీ వ్యవహారా కమిటి ఏదో ఓ కమిటిలో సభ్యునిగా నియమిస్తారు. కాకపోతే విజయసాయికి అత్యధిక ప్రాధాన్యత దక్కటం మాత్రం నిజమే. తమకు కేంద్రమంత్రులతోను, ప్రధానితోను సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారుట ఎంపిలు. మొదటిసారి ఎంపిలైన వారికి కేంద్రమంత్రులతోను, ప్రధానితోను సన్నిహిత సంబంధాలు ఎలాగుంటాయో ఎల్లోమీడియానే చెప్పాలి. మొత్తం మీద పై ఇద్దరు ఎంపిలపైకి మిగిలిన ఎంపిలను బాగా రెచ్చగొడుతున్నట్లే అనిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: