ఆకలి రుచి ఎరుగదు. నిదుర సుఖమెరుగదు అనే నానుడి వాడుకలో ఉంది. నిజమే కదండీ ఆకలేసిన వారికి ఏది పెట్టిన దాని రుచి గురించి ఆలోచించక గబగబ తినేస్తారు. ఇక నిదుర వచ్చిన సమయంలో పట్టుపరుపుల సుఖం గురించి ఆలోచించక ఎక్కడైన నడుం వాలిస్తే వెంటనే నిదుర వచ్చేస్తుంది. 

 

 

లోకంలో తిండికి కరువైన వారు ఎందరో ఆకలితో అలమటిస్తూ, కంటినిండా నిదురలేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క బుక్క అన్నం కోసం ఎంగిలాకులు వెతికే వారున్నారు. ఆకలి విలువ తెలిసిన వారికి అన్నం విలువ తెలుస్తుంది. కాని నేటి సమాజంలో ఫంక్షన్ల పేరిట వినోదిస్తూ విలువైన ఆహార పదార్ధాలను నేలపాలు చేస్తున్నారు.

 

 

సమాజంలో సంపాదన పెరిగింది. దానితోపాటే విలాస జీవితాన్ని అనుభవించే వారి సంఖ్య కూడ పెరిగింది. తన సుఖం కోసం లక్షలు ఐన తగిలేసే మనిషి. ఆకలితో ఉన్నవాడికి పిడికెడు మెతుకులు పెట్టడానికి మాత్రం ఆలోచిస్తాడు. ఇక్కడ ప్రతివారు ఒక్కటి గుర్తుంచుంకోవలసిన విషయం ఏంటంటే ఆకలికి ఉన్నవాడు లేని వాడు అనే తేడా తెలియదు. అది అందర్ని వేధిస్తుంది. దానికి కావలసింది సమయానికి ఇంత ఆహారం.

 

 

ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి పుట్టుకతోనే ఆకలి మొదలవుతుంది. కాని మనుషుల ఆలోచనల్లో ఉన్న తేడా వల్ల పేదవారు ఉన్నవారు అని వేరు చేసి చూస్తున్నారు. ఇక అన్నదానం మహాపుణ్యాన్ని కలిగిస్తుందంటారు. ఒక పేదవాడి ఆకలి తీర్చడమంటే నిజంగా అది మహభాగ్యంగా భావించే వారు కూడా ఉన్నారు. ఇకపోతే గతంలో తాము అధికారంలోకి వస్తే రూ. 10 కే కడుపు నిండేంత భోజనాన్ని ప్రజలకు అందిస్తామని శివసేన పార్టీ మహారాష్ట్రలో ప్రకటించింది.

 

 

అయితే దీనిని సాకారం చేస్తూ మహారాష్ట్రలోని ఠాణెలో కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు రూ. 10కే భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని దినేష్ మెహరోల్, సునీల్ చెటోలెలు తమ ‘బ్రదర్స్ గ్రూప్’ మిత్రులతో కలసి నిర్వహిస్తున్నారు. తొలుత ప్రతీరోజూ 400 మందికి భోజనం అందించేందుకు సన్నాహాలు చేశారు.

 

 

ఈ సందర్భంగా మెహరోల్ మాట్లాడుతూ ఖారటన్ రోడ్డు ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో పేదలు, శ్రామికులు ఉంటున్నారు. వీరికి కడుపునిండా భోజనం దొరకని పరిస్థితిని గ్రహించాం. వీరిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రూ. 10కే కడుపునిండా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

 

 

ఇలాంటి పధకాలు అన్నిచోట్ల పెట్టడమే కాకుండా వాటిని చిత్త శుద్ధితో నిర్వహిస్తే సమాజంలో ఆకలితో మరణించే వారి సంఖ్య కొంతైనా తగ్గుతుంది.. ఇక సేవ చేయడం గొప్పకాదు చిత్తశుద్దితో ప్రతిఫలాపేక్ష లేకుండా సేవచేయడమే ముఖ్యం.  

మరింత సమాచారం తెలుసుకోండి: