ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. మొదట డిసెంబర్ 2వ తేదీ నుండే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వార్తలు వచ్చినా తాజాగా అసెంబ్లీ సమావేశాలు 9వ తేదీ నుండి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు పని దినాలు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విసృతంగా ఈ సమావేశాల ద్వారా తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణలకు ధీటుగా జవాబు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ యంత్రాంగం అసెంబ్లీ శీతాకాల సమావేశాల కొరకు ఐదు రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తోంది. 
 
వైసీపీఎల్పీ కార్యాలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విప్ లు జోగి రమేశ్, మల్లాది విష్ణు, ఉదయభాను కలిసి అసెంబ్లీ శీతాకాల సమావేశాల గురించి చర్చించారని సమాచారం. స్పీకర్ తమ్మినేని సీతారాం గత శనివారం ఢిల్లీలో అసెంబ్లీ కార్యకలాపాల్లో ఐటీ సేవల వినియోగం గురించి జరిగిన చర్చలో పాల్గొన్నారు. 
 
తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పూర్తి డిజిటలైజేషన్ కు సంబంధించిన ప్రతిపాదనలను డిసెంబర్ నెల 17వ తేదీలోపు కేంద్రానికి పంపాలని నిర్ణయించామని అన్నారు. ఏపీ అసెంబ్లీ కార్యకలాపాల కంప్యూటరీకణ మూడు దశల వరకు పూర్తయిందని తమ్మినేని సీతారాం తెలిపారు. ఈసారి జరగబోయే సమావేశాల్లో రాజకీయంగా వివాదాలకు కారణమైన అంశాల గురించి సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. భవన నిర్మాణ కార్మికులు, ఇసుక కొరత, ఎక్సైజ్ విధానం, సింగపూర్ తో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ఒప్పందం రద్దు, రివర్స్ టెండరింగ్ మొదలైన అంశాల గురించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: