ఆర్టీసీ యూనియన్లు  47 రోజుల పాటు చేసిన నిరవధిక సమ్మె ఏం సాధించింది ? ఏం సాధించందంటే మిగిలిన శాఖల్లోని యూనియన్లు సమ్మె అంటేనే వణికిపోయే పరిస్ధితి తెచ్చింది. తప్పొప్పుల విషయాన్ని పక్కన పెట్టేస్తే ఆర్టీసి సమ్మె వల్ల కేసియార్ జాతీయస్ధాయిలో హీరో అయిపోయారు. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా సమ్మె అంటేనే మండిపోతుంది.

 

కానీ చాలా ప్రభుత్వాలు సమ్మె ప్రభావానికి దిగిరాక తప్పని పరిస్ధితి ఏర్పడుతుంది. మరి 47 రోజుల పాటు జరిగిన సమ్మెలో సుమారు 25 మరణించారు. ఏకంగా 47 వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాల కోసం కేసియార్ ను దేబిరించాల్సిన పరిస్ధితి ఎదురైంది. 47 రోజుల సమ్మెతో ఇటు ఆర్టీసి సంస్ధా వందల కోట్ల రూపాయలు  నష్టపోయింది. అటు కొందరు ఉద్యోగులూ మరణించారు. రెండున్నర నెలల జీతమూ కోల్పాయారు.

 

ఇంత చేసి సమ్మె సాధించిందేమిటి ? ఏమిటంటే కేసియార్ ను జాతీయ స్ధాయిలో హీరోను చేయటానికే ఉపయోగపడింది. నిజానికి 47 వేలమంది సమ్మె చేస్తే మరోకరైతే తట్టుకునే వారు కాదు. కేసియార్ మొండివాడు కాబట్టే తట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఏమిటి ? ఏమిటంటే కేసియార్ ఎవరిని చూస్తే పెట్రోల్లాగ భగ్గున  మండిపోతారో వారందిరినీ యూనియన్ నేతలు ముందు పెట్టుకున్నారు.

 

ముందసలు ఆర్టీసి యూనియన్ల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అంటేనే కేసియార్ మండిపోతారు. అటువంటి వ్యక్తే సమ్మెను లీడ్ చేశారు. అదే సమయంలో వామపక్షాలు, కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు సమ్మెలో కనిపించారు. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ చాలా యాక్టివ్ గా తిరిగారు సమ్మెలో.

 

అంటే ఏ నేతల పేర్లు ఎత్తితేనే కేసియార్ మండిపోతారో అటువంటి వాళ్ళందరూ ఆర్టీసీ సమ్మెలో అగ్రభాగంలో కనిపించేసరికి కేసియార్ ఇంకా బిగుసుకుపోయి కూర్చున్నారు. పైగా సిఎంకు సలహాలు, సూచనలు ఇచ్చేంత స్ధాయిలో మంత్రులు ఉన్నతాధికారులు కూడా లేరు. సో ఏ విధంగా చూసుకున్నా సమ్మె వల్ల కేసియార్ మాత్రమే లాభపడ్డారు. మిగిలిన రాష్ట్రమంతా నష్టపోయింది. సమీప భవిష్యత్తులో ఇంకే యూనియన్ కూడా సమ్మె అంటేనే వణికిపోయే పరిస్ధితి వచ్చిందన్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: