ఆర్టీసి కార్మికులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎటువంటి షరతులు విధించకుంటే తాము ఉద్యోగాల్లో చేరేందుకు కూడా సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.  ఇప్పుడు బంతి ప్రభుత్వ కోర్టులో ఉంది. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని గతంలో సీఎం కేసీఆర్ రెండు సార్లు పిలుపునిచ్చారు. అయినా కార్మికులు తమ సమ్మెను కొనసాగించారు. ఇది సీఎం కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో కార్మికుల డిమాండ్ల పై ఎట్టి పరిస్థితుల్లో స్పందించేది లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత హైకోర్టు చేతులెత్తయడంతో చేసేది లేక ఆర్టీసి కార్మికులు 47 రోజుల తమ సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టారు. 

 

ఇప్పుడు ఇక తెలంగాణ అంతా సీఎం కేసీఆర్ ఆర్టీసి కార్మికుల పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఉద్యోగులు వెనక్కి తగ్గడంతో సీఎం కేసీఆర్ కూడా మానవతా ధృక్పథంతో వారిని విధుల్లో చేరేందుకు అనుమతిచ్చేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. జరిగిన దానిని పట్టించుకోకుండా గతంలో ఉన్న పరిస్థితుల వలే ముందుకు పోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. సంస్థ పరిరక్షణ, అభివృద్దికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. 

 

ఇప్పుడు ఉద్యోగులను చేర్చుకోం అని చెబితే ఇది మరో ఉద్యమానికి దారితీసే ప్రమాదముందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. మళ్లీ సమసిన వివాదాన్ని రగిల్చిన వారిమి కూడా అవుతామని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇందులో ఎవరి గెలుపు ఎవరి ఓటమి లేదని వారన్నారు. కార్మికులను విధుల్లో చేర్చుకునేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  గురువారం సాయంత్రం వరకు దీని పై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని సమాచారం. యావత్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: