రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకురానుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలియచేయడం జరిగింది. తాజాగా వెలగపూడి  సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి  మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నూతన మద్యం విధానం అమలుపై సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ఐదు దశల్లో మద్యపాన నిషేధాన్ని పకడ్భందీగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు. 

 

ప్రజాసంకల్పయాత్ర సమయంలో  మద్యపానం వల్ల రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు  ఎదుర్కొంటున్న ఆర్థిక, మానసిక ఇబ్బందులను మహిళలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చిన  సందర్భాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అమలుకు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 839 బార్లు, 38 త్రీస్టార్ హోటళ్లు, 4 మైక్రో బ్రూవరీస్ షాపులు నడుస్తున్నాయని మంత్రి వెల్లడించారు. మొదటగా 50 శాతం మేర బార్ షాపుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పటికీ అధికారుల సూచన మేరకు వాటిలో తొలివిడతగా స్టార్ హోటళ్లు, బీర్ షాపులు మినహా మిగతా బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని నిర్ణయించారని పేర్కొన్నారు. 

 

అదే విధంగా ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామని, విడతల వారీగా మిగతా వాటిని కూడా తగ్గించాలని సమీక్షలో నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. బార్ల అనుమతులకు సంబంధించి లైసెన్స్ ఫీజును నిర్ణయించి దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ పద్ధతిని అవలంభించడం జరుగుతుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.  బార్లలో నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. అనుమతులు పొందిన బార్ల యజమానులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే వారి నుంచి 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అదే విధంగా నాటుసారా, కల్తీ మద్యంపై  ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందన్నారు. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్‌ చేసినా, నాటుసారా తయారు చేసినా  కఠిన చర్యలు విధిస్తామన్నారు. నాన్‌బెయిల్‌ బుల్‌ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: