జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదో సమస్యతో బాధపడుతున్నారు. సమస్య ఏమిటో బయటకు తెలీకపోయినా బాధ పడుతున్నట్లు మాత్రం అర్ధమైపోతోంది.  అందులోను జగన్మోహన్ రెడ్డిని సిఎంగా అంగీకరించాలంటే ఇంకా బాధపడిపోతున్నారు.  ఈ విషయం ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా బయటపెట్టేసుకుంటున్నారు.

 

నిజానికి జగన్ ను ఢీ కొట్టేశక్తి ఒక్క చంద్రబాబునాయుడుకు మాత్రమే ఉందని అందరూ అంగీకరించాల్సిందే. పవన్ కల్యాణ్ అంటే ఏదో గాలివాటం మనిషి అనే ఇప్పటికీ చాలామంది అభిప్రాయపడుతుంటారు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఆయన ప్రసంగాలను, పర్యటనలను, చివరకు రెండు నియోజకవర్గాల్లో పోటి చేయటాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు.

 

జనాలు జనసేనను  పట్టించుకోలేదనటానికి నిదర్శనమే తాను పోటి చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్లా పవన్ ఓడిపోవటం. లేకపోతే పార్టీ అధినేత అందులోను ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న పవన్ రెండు చోట్లా ఓడిపోవటమేంటండి బాబు. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే అఖండ మెజారిటితో గెలిచిన జగన్ అంటే పవన్ కు బాగా మంటన్న విషయం అర్ధమైపోతోంది.

 

చంద్రబాబు గురించి ట్విట్టర్లో ప్రస్తావించేటపుడు మాత్రం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అంటూ సంబోధించేవారు. అదే జగన్ విషయానికి వస్తే ఇపుడు అదే ట్విట్టర్లో వైసిపి లీడర్ శ్రీ జగన్ అని మాత్రమే సంబోధిస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కమ్ వైసిపి అధ్యక్షుడన్న విషయం అందరికీ తెలిసిందే.

 

అలాంటిది సిఎంను పట్టుకుని వైసిపి లీడర్ శ్రీ జగన్ అనిమాత్రమే సంబోధిస్తున్నారంటేనే పవన్ ఏస్ధాయిలో మండిపోతున్నారో అర్ధమైపోతోంది. జగన్ అంటే పవన్ కు ఎందుకంత ఈర్ష్యో అర్దం కావటం లేదు. జగన్ విషయంలో చంద్రబాబు మండిపోతున్నారంటే అర్ధముంది.  మూడుసార్లు సిఎంగా, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిన తనను చావుదెబ్బ కొట్టి ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన జగన్ అంటే చంద్రబాబుకు మంట ఉండటాన్ని  అర్ధం చేసుకోవచ్చు. మరి తనను తాను ఏం ఊహించేసుకుని పవన్ కూడా జగన్ అంటే ఈర్ష్య పడుతున్నారో అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: