మనుషుల్లో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుంది. కొందరు మనుషులు పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెదరాజుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వెంకటయ్య, వెంకట లక్ష్మి దంపతుల కుమారుడు సతీష్ మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొన్ని నెలల క్రితం సతీష్ తల్లి వెంకట లక్ష్మికి క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. సతీష్ పలు ఆస్పత్రుల్లో వెంకటలక్ష్మికి చికిత్స చేయించాడు. 
 
4 లక్షల రూపాయలు వెంకట లక్ష్మి చికిత్స కోసం ఖర్చు పెట్టాడు. ఈ నెల 18వ తేదీన వెంకట లక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సతీష్ తల్లిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు రిమ్స్ కు తరలించాలని చెప్పారు. తన తల్లిని ఇంటికి తీసుకొస్తూ ఉండగా ఆ ఇంటి యజమాని సతీష్ తో తన తల్లిని ఇంట్లోకి తీసుకొనిరావద్దని చెప్పాడు. తన తల్లిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక సతీష్ స్థానిక ఆసుపత్రికి తీసుకొనివెళ్లాడు. 
 
ఆసుపత్రి సిబ్బంది సతీష్ తల్లిని ఆసుపత్రిలో ఉంచటానికి అనుమతి ఇవ్వలేదు. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక పంచాయతీ సిబ్బంది చెత్తను ఉంచే గదిలో వారి అనుమతితో సతీష్, వెంకటలక్ష్మి తలదాచుకొన్నారు. పంచాయతీ సిబ్బంది అక్కడినుండి వెళ్లిపోవాలని చెప్పటంతో చేతులతో తన తల్లిని మోసుకుంటూ సతీష్ డీవీఆర్ పార్కుకు వెళ్లాడు. పార్కులో టెంట్ వేసుకొని మంగళవారం రాత్రి 8గంటల వరకు సతీష్ తన తల్లితో కలిసి అక్కడే ఉన్నాడు. 
 
ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్నతాధికారులు పామూరు వైద్యాధికారికి వెంకటలక్ష్మిని ఆస్పత్రిలో చేర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట లక్ష్మి నిన్న మరణించింది. సతీష్ మీడియాతో మాట్లాడుతూ బంధువులు, స్నేహితులు ఎవరూ తనకు సహాయం చేయలేదని చెప్పాడు. ఈ దుస్థితి వేరెవరికీ రాకూడదని తన గోడు పట్టించుకున్నవారు ఎవరూ లేరని సతీష్ బాధ పడ్డాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: