ఆర్టీసీ జేఏసీ నిన్న చేసిన ప్రకటన నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్ రవాణా శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలా...? వద్దా...? అనే అంశంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల అటు ఆర్టీసీ కార్మికుల్లో ఇటు ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ జేఏసీ షరతులు పెట్టకపొతే కార్మికులు విధుల్లో చేరతారని చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది. 
 
మధ్యాహ్నం 2 గంటల తరువాత ఈ సమావేశం జరగబోతుందని తెలుస్తోంది. గతంలో కార్మిక సంఘాలు లేకుండా కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం షరతు పెట్టిన నేపథ్యంలో గతంలో ఈ షరతుపై కార్మికుల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు కొన్ని షరతులు పెట్టి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. 
 
సీఎం కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఒక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో 28 మంది కార్మికులు వివిధ కారణాల వలన మృతి చెందారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం జరగాలని వివిధ రాజకీయపార్టీలు కోరుతున్నాయి. సీఎం కేసీఆర్ షరతులు పెడితే మాత్రం కార్మికుల సమ్మె మరలా మొదలయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. 
 
గత రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు కూడా అందలేదు. లేబర్ కోర్టు తమ సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకంతో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కార్మిక సంఘాల గురించి కూడా సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రకటన తరువాత కార్మిక సంఘాలు మరోసారి సమావేశమై తుది ప్రకటనను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5గంటల తరువాత సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: