మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సర్కారు ఏర్పాటుపై మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. శివసేన...కాంగ్రెస్...ఎన్సీపీ కూటమి పేరు త్వరలోనే బయటికి రానుంది. మూడు పార్టీలకు చెందిన నేతలు ఇప్పటికే చర్చించారు. అయితే ...కాంగ్రెస్‌తో పొత్తు శివసేనలో అసంతృప్తికి కారణమవుతోంది. అసమ్మతి ఎమ్మెల్యేలను ఉద్ధవ్ థాక్రే బుజ్జగించే పనిలో  పడ్డారు.   

 

మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకూ ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న  శివసేనకు సొంత ఎమ్మెల్యేలే షాకిచ్చేలా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపై ఏకంగా 17 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అసమ్మతి  ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉధ్ధవ్ థాక్రేతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అసమ్మతి ఎమ్మెల్యేల్ని శివసేన ఇప్పటికే రిసార్టుకు తరలించింది. అటు ప్రధానితో భేటీ అయిన శరద్ పవార్ రాజకీయాలపై చర్చించలేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే...ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కేంద్రమంత్రి అథవాలే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత గందరగోళానికి తెరతీశాయి. 


మరోవైపు...కొన్నిరోజులుగా శివసేనకు మద్దతిచ్చే విషయంపై గుంభనంగా ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. శరద్ పవార్‌తో జరిగిన భేటీలో శివసేన సర్కారుకు మద్దతివ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సోనియా నిర్ణయం తర్వాత ఢిల్లీలో పవార్ సమక్షంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు భేటీ అయ్యారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపకల్పనపై చర్చించారు. అయితే సోనియాతో పవార్ భేటీలో మాత్రం ఈ విషయం చర్చకు రానట్టు తెలుస్తోంది. డిసెంబర్ మొదటివారంలోనే సంకీర్ణ సర్కారు కొలువుదీరుతుందని శివసేన ధీమా వ్యక్తంచేస్తోంది. 

 

ఇక...మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంపై కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతలు కీలక చర్చలు జరిపారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని  ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ నివాసంలో భేటీ అయ్యారు. శివసేనతో కలిసి ముందుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళిక, విధివిధానాలపై చర్చించినట్టు  తెలుస్తోంది. తమ మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ఎజెండాపై కసరత్తు చేసినట్టు సమాచారం. శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు  చేస్తే కూటమికి ఏ పేరు పెట్టాలి? దాని విధివిధానాలు ఎలా ఉండాలి? మంత్రి పదవుల పంపకం తదితర కీలక అంశాలను ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది వాస్తవానికి ఈ భేటీ మంగళవారమే జరగాల్సి ఉంది. ఐతే...ఇందిరా గాంధీ జయంతికావడంతో కాంగ్రెస్‌ నేతల కోరిక మేరకు నిన్న నిర్వహించారు. 

 

మొత్తానికి...మహారాష్ట్రలో సర్కారు ఏర్పాటుపై ఇప్పటికిప్పుడే పూర్తిస్థాయిలో క్లారిటీ రాకపోయినప్పటికీ... శివసేనతో కలిసి ఎన్సీపీ...కాంగ్రెస్  ప్రభుత్వం కొలువుదీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: