వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ గంగాజల్ సాక్షరతయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ... నల్లమల అటవీప్రాంతంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ...తెలుగు రాష్ర్టాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భవిష్యత్ ప్రమాదంలో పడిందని  హెచ్చరించారు. శ్రీశైలం డ్యాం కు మరమ్మతులు చేయాల్సిన అవసరముందని, లేనిపక్షంలో పెనువిషాదం తప్పదని హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే భారీనష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. డ్యాం సమీపంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వాలు నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయే తప్ప, నిర్వహణ బాధ్యతలు సరిగా చూసుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉందన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యాం భద్రతకు ఎటువంటి ముప్పు లేదని స్ప‌ష్టం చేశారు.

 

ఏపీ ప్రభుత్వం శ్రీశైలండ్యాం నిర్వహణలో భాగంగా మరమ్మతులు చేపట్టాలని రాజేంద్ర‌సింగ్‌ కోరారు. ప్ల‌గ్‌పూల్ దగ్గర మరమ్మతులు అవసరమని గుర్తించినట్టు చెప్పారు. డ్యాం నిర్వహణకు కేం ద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం 600 మంది సిబ్బంది అవసరమని, కేవలం వంద మందే ఉన్నారని చెప్పారు. డ్యాం రీహాబిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు-2 కింద నిధులు తీసుకోవచ్చని, కేవలం రూ.60 కోట్లతో మరమ్మతులు పూర్తవుతాయని తెలిపారు.

 


ఈ నేప‌థ్యంలో, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న మంత్రి  శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ... ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూర‌మ‌ని తెలిపారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు కల్పించవద్దని విజ్ఞప్తి చేస్తున్నామ‌ని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: