`మ‌హా` ట్విస్టుల‌కు తెర‌ప‌డింది. అధికారిక ప్ర‌క‌ట‌నే...మిగిలి ఉంది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంకీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ భేటీలో చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రేపు ముంబయిలో జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం రావచ్చు . శివసేనతో పొత్తుకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

 

కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఢిల్లీలో చర్చోపచర్చలు కొనసాగించారు.  బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్‌పవార్‌తో సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ), మంత్రి పదవుల పంపకం వంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం. సీఎం పదవిని శివసేన-ఎన్సీపీ చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌కు పూర్తికాలం డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని పేర్కొన్నాయి. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ అంగీకరిస్తూనే...శివసేన హిందుత్వ విధానాన్ని పక్కనబెట్టాలనే షరతు విధించనున్నట్టు తెలిసింది. మంత్రి పదవుల్లో శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్‌ 12 చొప్పున పంచుకోవాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ఈ నేప‌థ్యంలో...తాజాగా సోనియాగాంధీ స‌మక్షంలో  మహారాష్ట్రలో తాజా పరిస్థితులపై సీడబ్ల్యూసీ స‌మావేశం జ‌రిగింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు సమావేశంలో చర్చించారు. అనంతరం ఆ పార్టీ నేత వేణుగోపాల్ మాట్లాడుతూ..మ‌హారాష్ట్ర ప‌రిణామాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఇవాళ కాంగ్రెస్, ఎన్‌సీపీ మధ్య చర్చలు కొనసాగుతాయన్నారు. రేపు ముంబయిలో జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం రావచ్చు అని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా, మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌రౌత్‌ పేర్కొన్నారు. పొత్తు మూడు పార్టీల మధ్య కాబట్టి చర్చలు సుదీర్ఘంగా సాగుతాయని చెప్పారు. సంకీర్ణ ప్రక్రియ బుధవార మే మొదలైందని, 2-5 రోజుల్లో పూర్తవుతుందన్నారు. డిసెంబర్‌లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: