ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చింది. సినిమాల్లో బిజీగా ఉన్న జూనియర్ రాజకీయ ప్రవేశంపై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎపీసోడ్ తో మరోసారి జూనియర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతోంది. 

 

టీడీపీని వీడేందుకు సిద్ధమైన వల్లభనేని వంశీ వ్యవహారానికి మూలం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ను పార్టీలోకి తీసుకురావాలి.. ఆయనను యాక్టివ్ చేయాలనే ఆలోచనలు టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత ఆ ఆలోచనలు మరింత ఊపందుకున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీకి సమర్ధ నాయకత్వం ఎవరు అందిస్తారనే చర్చ టీడీపీలో గత కొంత కాలంగా నడుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఉన్నప్పటికీ ఆయన శక్తి సామర్ధ్యాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు కొడుకుగా పార్టీలో క్రియాశీలకం కాగలిగారే కానీ... కీలకం కాలేకపోయారనేది నాయకుల విశ్లేషణ. దానికితోడు మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోవడం లోకేష్ రాజకీయ సామర్ధ్యాలపై అందరిలోనూ డౌట్స్ మొదలయ్యాయి. 

 

చంద్రబాబు తర్వాత పార్టీని సమర్ధవంతంగా నడపగలిగే శక్తి జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని ఓ వర్గం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇందులో చంద్రబాబు అనుకూలురు, వ్యతిరేకులూ, పార్టీలో ఉన్న వాళ్లు.. పార్టీ బయట ఉన్న వాళ్లూ ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో ఎన్టీఆర్ వాగ్ధాటికి జనం ముగ్ధులయ్యారు. తాత అంశలో పుట్టిన వ్యక్తిగా జనం జూనియర్ ను ఆరాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడినా... రాజకీయాల్లో రాణించగల క్వాలిటీస్ ఉన్న వ్యక్తిగా జూనియర్ ఎస్టాబ్లిష్ అయ్యారు.

 

అప్పటి నుంచీ అడపాదడపా... రాజకీయాల్లో జూనియర్ ప్రస్తావన వస్తూనే ఉంది. 2009 ఎన్నికల ప్రచార సమయంలో గాయపడ్డ జూనియర్ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే దానికి కారణం చంద్రబాబే అంటున్నారు వంశీ. కావాలనే జూనియర్ ను పక్కన పెట్టేశారని... అందుకే ఆయనా రాజకీయాలకు దూరం అయిపోయారని చెబుతున్నారు. వంశీ మాటలు నిజమా అన్నట్టు... 2009 ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న జూనియర్ ఆ తర్వాత అంతే స్థాయిలో టీడీపీలో కనిపించకుండాపోయారు. ఓ రకంగా పార్టీ ఆయన్ను వదిలేసిన్టటు కనిపించింది. అది కావాలని జరిగిన కుట్రే అంటున్నారు వంశీ.

 

వైసీపీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ జూనియర్ కు ఒక దశలో కేర్ టేకర్లుగా ఉన్నారు. ఈ ఇద్దరూ జూనియర్ తో పలు సినిమాలు రూపొందించారు. జూనియర్ ను పక్కన పెట్టేందుకు కుట్ర జరిగిందని... దానికి నిరసనగానే కొడాలి నాని టీడీపీని వీడారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ స్వస్థలం, స్వగ్రామం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. హరికృష్ణ ఫ్యామిలికి దగ్గరిగా ఉండే కొడాలి నాని.. వారికి పార్టీ జరిగిన అనుమానాలు సహించలేకే టీడీపీని వీడారు. 

 

ఇప్పుడు వంశీ మాటల్లోనూ ఆదే కోణం కనిపిస్తోంది. టీడీపీ ఓటమి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో వంశీ టచ్ లోకి వెళ్ళారని భావించి... అది తెలిసి చంద్రబాబు, లోకేష్ తనకు  వ్యతిరేకంగా సోషల్ మీడియా లో వార్తలు రాయించారని చెబుతున్నారు. వాస్తవంగా తాను జూనియర్ తో రాజకీయాల గురించి మాట్లాడలేదని... కానీ అభద్రతా భావంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ తనను పొమ్మనకుండా పొగపెట్టడానికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకున్నారని చెప్పారు వంశీ. టీడీపీ మాత్రం దీనిపై రివర్స్ ఎటాక్ చేస్తోంది. జూనియర్ పార్టీకి దూరం కావడానికి వంశీ, నానిలే కారణమని ధ్వజమెత్తుతోంది. జూనియర్ ను అన్ని విధాలా వాడుకుంది వారిద్దరేనని ఆరోపించింది. అయితే గతంలోనూ ఇదే రకంగా చర్చ కొనసాగింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని వదిలేశారనీ, దూరంగా ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానిపై స్పష్టత ఇచ్చారు జూనియర్. తన కట్టె కాలే వరకు టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు జూనియర్. వరుస సినిమాలతో హడావిడిగా ఉన్న జూనియర్.... తన సినిమా కెరీర్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. తెలిసీ తెలియని వయసులో పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ.... ఇప్పటికైతే తన ఇంట్రెస్ట్ అంతా... సినిమాలపైనేనని పలు మార్లు స్పష్టం చేశారు జూనియర్.  కానీ టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పుడల్లా జూనియర్ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ జరుగుతుండటం విశేషం. నలబై ఏళ్ల లోపు వయస్సులో ఉన్న జూనియర్ రాజకీయాలపై ఇప్పట్లో ఆసక్తి చూపే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో పది పదిహేనేళ్ల తర్వాతే జూనియర్ రాజకీయాల గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి టీడీపీకి పునరుజ్జీవనం కల్పించే శక్తి జూనియర్ కే ఉన్నాయని వారు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయాలలో లేని వ్యక్తి చుట్టూ ఏపీ ప్రతిపక్ష రాజకీయాలు తిరుగుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: