వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ భారత పౌరసత్వం వివాదం మ‌లుపులు తిరుగుతోంది. చెన్నమనేని పౌరసత్వం రద్దును కోరుతూ వేములవాడకే చెందిన ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయడంతో 2017లోనే రమేష్‌ పౌరసత్వాన్ని హోంశాఖ రద్దుచేసింది. 1955 పౌరసత్వచట్టం సెక్షన్‌ 10 ప్రకారం ఆయన సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్లుగా హోం శాఖ అండర్‌ సెక్రటరీ జీ సుధాకర్‌ పేరిట బుధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. అయితే, పౌరసత్వం రద్దు విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండ‌గా...ఆయ‌న కోర్టును ఆశ్ర‌యిస్తే తనకు సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కెవియేట్ పిటిషన్ దాఖలు చేయ‌డం కొస‌మెరుపు.

చెన్నమనేని పౌరసత్వం రద్దును కోరుతూ ఆది శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయడంతో 2017లోనే రమేశ్‌ పౌరసత్వాన్ని హోంశాఖ రద్దుచేసింది. ఈ నిర్ణయాన్ని ఆయన హైకోర్టులో సవాలుచేశారు. దాదాపు రెండేళ్ల‌ సుదీర్ఘ విచారణ తర్వాత హోంశాఖ ఉత్తర్వులను రద్దుచేస్తూ హైకోర్టు ఇటీవలే తీర్పుచెప్పింది. మ‌ళ్లీ ఆది శ్రీ‌నివాస్ కేంద్ర హోంశాఖను ఆశ్ర‌యించ‌డంతో...బుధవారం తిరిగి ఆయన పౌరసత్వాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.

 


దీంతో ర‌మేష్ మ‌ళ్లీ కోర్టు మెట్లెక్కారు. పౌరసత్వం చట్టం, వాటి నియమ నిబంధనలు, దరఖాస్తులను సమగ్రంగా, హేతుబద్ధంగా, నైతిక విలువలను, వ్యక్తి సామాజిక నిబద్ధతను పరిగణిస్తూ (సెక్షన్‌ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని కోర్టు తీర్పులో తెలిపిందన్నారు. హోంశాఖ వీటన్నంటిని పరిగణనలోకి తీసుకొని తన నిర్ణయాన్ని తెలుపాలని ఆదేశించిందన్నారు. ఒకవేళ సెక్షన్‌ 10.3 ని పరిగణించకుండా హోంశాఖ ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయంకోసం మళ్ళీ తమ వద్దకు రావచ్చని హైకోర్టు తెలిపిందని రమేశ్‌బాబు గుర్తుచేశారు.

 

అయితే, చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ హోంశాఖ  ఇచ్చిన ఉత్తర్వులతో ఆది శ్రీ‌నివాస్‌ హైకోర్టులో కెవియట్  దాఖలు చేశారు. తమకు తెలియకుండా ఎలాంటి ప్రక్రియను చేపట్టారదని పిటిషన్‌లో తెలిపారు. దీంతో...ర‌మేష్ పౌర‌స‌త్వంపై ఉత్కంఠ నెల‌కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: