గంగపుత్రుల జీవితాలు మార్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్యకారుల భరోసా పథకాన్ని ప్రారంభించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని లక్షా 35 వేల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పశువుల్లంక - సలాదివారి పాలెం వంతెనను కూడా ప్రారంభించారు సీఎం జగన్. 

మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఉపాధి లేక కొన్ని కుటుంబాలు పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పాదయాత్ర సమయంలో దీన్ని గమనించిన జగన్ సర్కార్‌ వారికి భరోసా ఇచ్చేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రారంభించారు సీఎం జగన్‌. రాష్ర్టంలోని లక్షా 35 వేల కుటుంబాలను లబ్దిదారులుగా చేర్చుతూ ఈ పథకాన్ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. 


వేట నిషేధ కాలంలో ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు సీఎం జగన్. అంతకుముందు 4వేల రూపాయలుగా ఉన్న సాయాన్ని పది వేలకు పెంచింది వైసీపీ సర్కార్. వేటకు వెళ్లి మృతి చెందిన కుటుంబానికి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం. మత్స్యకారులకు డీజిల్‌పై అందించే రాయితీని 9 రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మర పడవలు, ఇంజిన్ కలిగిన తెప్పలకు కూడా రాయితీ కల్పించింది. ఒక్కో మర పడవకు నెలకు 27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు 2,700 రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు తిరగకముందే అదే వేదిక నుంచి హామీని నెరవేర్చామన్నారు సీఎం జగన్. 

 

ఇక ఫిష్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు సీఎం జగన్. తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాల కల్పినతో పాటు.. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు సీఎం జగన్. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్‌ల పటిష్టానికి చర్యలు కూడా తీసుకోబోతున్నట్టు తెలిపారు సీఎం. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్‌. ఎంతమంది శత్రువులు ఏకమైనా వారందరినీ ఎదుర్కొనే శక్తి తనకు ఉందన్నారు సీఎం జగన్‌. జిల్లా పర్యటనలో భాగంగా వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక - సలాదివారిపాలెం మధ్య వారధిని ప్రారంభించారు. 35 కోట్లతో నిర్మించిన ఈ వంతెన గోదావరి ఇరువైపులా ఉన్న 11 గ్రామాల్లోని 10 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: