ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేసింది. నాలుగో రోజు ఆధార్ డేటా చోరీ వ్యవహారం, భారత పోలిటికల్ మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును చేర్చకపోవడంపై చర్చ జరిగింది. కేంద్రం వెంటనే తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.

 

ఎల‌క్టోర‌ల్ బాండ్ల అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎల‌క్టోర‌ల్ బాండ్లతో అవినీతిని క‌ప్పిపుచ్చుతున్నార‌ని లోకసభలో కాంగ్రెస్ సభ్యుడు మ‌నీష్ తివారీ విమర్శించారు. ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు ఆయ‌న ఓ మీడియా రిపోర్ట్‌ను స‌భ‌లో ప్రస్తావించారు.  2018లో క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పీఎంవో ఆఫీసు ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు పచ్చ జెండా ఊపడమే కాకుండా, నియ‌మావ‌ళిని ఉల్లంఘించి బాండ్లను సేక‌రించిన‌ట్లు తివారీ ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ కూడా ఎల‌క్టోర‌ల్ బాండ్ల ప్రక్రియ‌ను త‌ప్పుప‌ట్టారు. అటు రాజ్యస‌భ‌లోనూ ఎల‌క్టోర‌ల్ బాండ్లపై కాంగ్రెస్ నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆధార్ డేటా చోరీ కేసులో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రారావు ప్రశ్నలేవనెత్తారు. ఆధార్ డేటా ప్రైవేటు సంస్థలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఐటీ శాఖ సహాయమంత్రి సంజయ్ ధాత్రే సమాధానమిచ్చారు.  ఐటీ గ్రిడ్ ద్వారా ఆధార్ డేటాను టీడీపీ చోరీ చేసిందని ఆరోపించడమే కాకుండా, ఎన్నికల కమిషన్‌కు కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది.


జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత కేంద్ర హోం శాఖ విడుదల చేసిన భారతదేశ పొలిటికల్ మ్యాప్‌లో ఏపీ రాజధాని అమరావతి పేరును చేర్చకపోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. అమరావతి పేరు కనిపించకపోవడం కేవలం ఏపీకి మాత్రమే జరిగిన అవమానం కాదని, ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానమని లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అమరావతితో కూడిన కొత్త మ్యాప్‌ను విడుదల చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.


21మంది ఎంపీలు ఉండే క‌మిటీని ర‌క్షణ‌శాఖ రిలీజ్ చేసింది. ప్యానెల్‌కు ర‌క్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వం వ‌హిస్తారు. క‌మిటీ జాబితాలో ఫరూక్ అబ్దుల్లా, సౌగ‌త్ రాయ్‌, ఏ రాజా, శ‌ర‌ద్ ప‌వార్‌లు కూడా ఉన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా థాకూర్‌ను క‌మిటీ ప్యానెల్‌లో స్థానం క‌ల్పించారు.  ఆమెను ఎలా ర‌క్షణ క‌మిటీలో స‌భ్యురాలిగా చేశార‌ని విమ‌ర్శలు కాంగ్రెస్ విమర్శించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: