బిజెపి చూపు వైసిపి ఎంపి మీద పడినట్లే అనుమానంగా ఉంది.  వివిధ పార్టీల నుండి ఎంపిలను తమ పార్టీలోకి లాక్కోవటంలో భాగంగా ఇప్పటికే తెలుగుదేశంపార్టీ నుండి నలుగురు ఎంపిలను లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే.  ఇదే పద్దతిలో వైసిపి ఎంపిలకు కూడా గాలమేసిందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

ఇందుకు పార్లమెంటు కేంద్రంగా తాజాగా జరిగిన ఘటనే అనుమానాలను పెంచేస్తోంది. పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రధానమంత్రి నరేంద్రమోడికి వైసిపి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు ఎదురుపడ్డారు. వెంటనే మోడి ఎంపిని చూసి ’ రాజుగారు ఎలాగున్నారు’ అంటూ నవ్వుతు పలకరించారు. తనచుట్టూ అంతమంది సెక్యురిటి సిబ్బంది ఉన్నాకూడా వాళ్ళను పక్కకు నెట్టి మరీ  పలకరించటమే ఎంపికి ఆశ్చర్యమేసింది.

 

సరే స్వయంగా ప్రధానే పలకరించిన తర్వాత  రాజు మాత్రం ఏం చేస్తారు ? అందుకనే వెంటనే ప్రధాని దగ్గరకు వెళ్ళి ఒంగిపోయి మరీ  నమస్కారం చేశారు. దాంతో ప్రధాని నవ్వుతు  ఎంపి భుజం తడుతు ఎలాగున్నారని ప్రశ్నించారు.  ఇక్కడ విచిత్రమేమిటంటే రఘురామ కృష్ణంరాజు వెంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డితో పాటు మరి కొందరు ఎంపిలు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళెవరినీ పలకరించలేదు. అంటే ఈయన గతంలో కొద్దిరోజులు బిజెపిలో ఉన్నారులేండి.

 

అదే సమయంలో అమరావతిలో బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. వైసిపికి చెందిన కొందరు ఎంపిలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. పార్లమెంటులో ప్రధాని ఓ ఎంపిని అదేపనిగా పలకరించటం ఇక్కడ అదేపార్టీకి చెందిన ఎంఎల్సీ వైసిపి ఎంపిలపై కామెంట్ చేయటం కాకతాళీయమా ? లేకపోతే  వ్యూహాత్మకమా ? అన్నదే తేలటం లేదు.

 

మొత్తానికి బిజెపి ఒకేసారి టిడిపి, వైసిపిలపై కన్నేసినట్లు అర్ధమవుతోంది. తాము బలపడాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అని బిజెపి ఎంఎల్సీ వీర్రాజు నిసిగ్గుగా ప్రకటించుకోవటమే విచిత్రంగా ఉంది. మొత్తం మీద వైసిపి ఎంపిల విషయంలో కూడా బిజెపి చాపక్రింద నీరులా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: