తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఎంత వేడిగా మారిందో అందరికి తెలిసిందే. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు, అనూహ్యమైన మలుపులు చివరికి ఉప్పులేని కూరలా మారి మళ్ళీ మొదటికొచ్చింది. ఇక అక్టోబర్ 5 న మొదలైన సమ్మె కొందరి కార్మికుల ప్రాణాలు తీయడం తప్పా ఏం చేయలేక పోయింది. దీంతో నవంబర్ 20 వరకు 48 రోజుల తర్వాత ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు..

 

 

ఇక మెచ్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ సమ్మె సమయంలో ఉద్యోగాలు ఊడుతాయని గాని, జీతాలు ఆగిపోయి, జీవితాలు కోల్పోతామని తెలిసినా కానీ, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం అన్నింటిని పక్కన పెట్టి సమ్మెబాట పట్టారు కార్మికులు. ఇక సమ్మె చేయడం తప్పుకాదు.. కానీ, సమ్మె చేసిన కాలమే తప్పు అని ప్రభుత్వం భావించింది. ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిలికి చిలికి  తుఫానులా మారి తెలంగాణను  తాకింది.

 

 

అక్కడ తీసుకున్న నిర్ణయం, ఇక్కడ తెలంగాణలోని కార్మికులను రెచ్చగొట్టేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ లో చేసినపుడు తెలంగాణాలో ఎందుకు చేయరనే పాయింట్ పట్టుకుని కార్మికులు సమ్మె చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన ప్రకంపనలు అన్ని తెలిసినవే. నోటీసులు ఇచ్చినా ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడం. దసరా సమయంలో కార్మికులు సమ్మెకు దిగడం. ఇలాంటి చర్యలవల్ల ప్రభుత్వానికి ఎక్కడలేని కోపం వచ్చింది.

 

 

ఐతే కార్మికులు దసరా తరువాత సమ్మెకు దిగితే మరోలా ఉండేది. కానీ, ప్రభుత్వానికి ఆదాయం లభించే దసరా, బతుకమ్మ సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కేసీయార్ ఇగో హర్ట్ అయ్యినట్లుంది. ఇదే కాకుండా ఏపీలో ఈ విధానాన్ని అమలు చేసినప్పుడు తెలంగాణాలో ఎందుకు చేయరు అనే మాటను తెరపైకి తీసుకురావడంతో కేసీయార్ కోపం నషాలానికి అంటినట్లుంది. అంతే సమ్మె చేస్తున్న 48వేలమంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేసినట్టు పేర్కొన్నారు.

 

 

దీంతో కార్మికులు హైకోర్టుకు వెళ్లడం హైకోర్టులో కేసు ముందుకు  జరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో మూడు సార్లు  కార్మికులు విధుల్లో చేరేందుకు ససేమిరా అనడంతో ఆర్టీసీని రద్దు చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేసి.. ప్రైవేట్ భాగస్వామ్యంతో 5100 రూట్లలో బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు కేసీయార్.

 

 

అయితే, ఈ 48 రోజుల తర్వాత సమ్మె చేసినా ఫలితం ఉండదని భావించిన ఆర్టీసీ జెఏసి సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించి కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరింది. ఇకపోతే ప్రస్తుతం కార్మికుల జీవితాలు కేసీఆర్ కోర్టులో ఉన్నాయి.

 

 

ఆయన తీసుకునే నిర్ణయం బట్టి కార్మికుల జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక విధుల్లోకి తీసుకుంటే కేసీయార్ హీరో అవుతారు. లేదని ఇగోలకు పోయి వాళ్ళను పక్కన పెడితే 50 వేళ కుటుంబాలను రోడ్డునపడేసిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతాడు అని కొందరు కామన్ మ్యాన్లు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: