విజయవాడ రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఆ కుటుంబం దశాబ్దాల కాలంగా విజయవాడ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వస్తున్నారు. మొదట టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఇలా రెండు పార్టీల్లోనూ దేవినేని నెహ్రూ కీలక పాత్ర పోషించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ ని వీడి టీడీపీలోకి వచ్చి అందులోనే కన్నుమూశారు. ఇక నెహ్రూ తర్వాత ఆయన తనయుడు అవినాష్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. టీడీపీలో తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగు యువత అధ్యక్షుడుగా పని చేస్తూ పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు.

 

అయితే ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబు ఆయన్ని గుడివాడ బరిలో దింపారు. కానీ అక్కడ కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన పార్టీలో యాక్టివ్ గా ఉంటూనే...తన సొంత నియోజకవర్గం విజయవాడ తూర్పు కావాలని బాబుని కోరిన దక్కలేదు. దీంతో ఈలోపు వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో అటు జంప్ అయిపోయారు. అంతా అనుకున్నట్లే ఆయనకు వైసీపీ తూర్పు బాధ్యతలు అప్పగించింది. అంటే వచ్చే ఎన్నికల్లో అవినాష్ ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగుతారు.

 

కాకపోతే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. 2009లో ఓటమి పాలైన గద్దె, 2014లో గెలిచి సత్తా చాటారు. అలాగే 2019లో కూడా రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన గద్దె మాత్రం 15 వేల మెజారిటీతో గెలిచారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే గద్దె ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి నేతని అవినాష్ ఎంతవరకు నిలువరిస్తారనేది ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ దేవినేని కుటుంబానికి మంచి పట్టుంది. వైసీపీకు కూడా చెప్పుకోదగిన కేడర్ ఉంది. అలాగే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచి రవి కూడా ఇక్కడ కేడర్ ఉంది.

 

అయితే యలమంచి, దేవినేని ఫ్యామిలీలకు పడదు. ముందు నుంచి వారు వైరి వర్గాలగానే కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్తితిలో యలమంచి వర్గం ఎంతవరకు అవినాష్ కు సహకరిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. కానీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితే అవినాష్ కు మంచి పట్టు దొరికినట్లే. ఇప్పుడు అవినాష్‌కు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఓ విధంగా అగ్ని ప‌రీక్ష లాంటివే. మరి చూడాలి తూర్పులో అవినాష్ సత్తా ఏ మేర ఉందో రాబోయే ఎన్నికల్లో తెలిసిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: