టీడీపీ పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన నాయకులు ఒకరేమో దేవినేని అవినాష్ .. మరొకరు వల్లభనేని వంశీ పార్టీ మారి ఏపీ రాజకీయాలను వేడెక్కేమించిన సంగతీ తెల్సిందే. అయితే దేవినేని అవినాష్ టీడీపీ మీద పెద్దగా విమర్శలు ఇప్పటివరకు చేయలేదు. టీడీపీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ టార్గెట్ చేసింది. అతడిపై దారుణంగా విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ చేసింది. దీంతో ఓపిక నశించి వంశీ తిరుగుబాటు చేయడంతో టీడీపీ నేతల నోళ్లకు మూతపడ్డాయి.ఇప్పుడూ అదే కథ.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై టీడీపీ అవాకులు చెవాకులు పేల్చుతోంది. స్వార్థం కోసం వెళ్లాడని విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దేవిని అవినాష్ కూడా బయటకొచ్చాడు. టీడీపీపై విమర్శలు గుప్పించారు.



వైసీపీ పార్టీలో దేవినేని అవినాష్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధినేత సీఎం జగన్ కు తాజాగా దేవినేని అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండాను విజయవాడలో ఎగురవేస్తానని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ చేస్తున్న విమర్శలకు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు.. ‘నేను టీడీపీకి ఉపయోగపడ్డాను కానీ.. నాకు టీడీపీ ఎప్పుడూ ఉపయోగపడలేదని’ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.

 

ఎన్నికల్లో టీడీపీ పార్టీ తనను వాడుకున్నదని తరువాత తనను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు ఏమాత్రం లాభం జరగలేదని.. ఎలాంటి భూ ఆక్రమణలు చేయలేని .. తప్పులకు పాల్పడలేదని అవినాష్ క్లారిటీ ఇచ్చారు. తాను తప్పు చేయనందున ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అవినాష్ స్పష్టం చేశారు. తనపై ఇంతవరకూ ఎలాంటి ఆరోపణలు లేవని.. టీడీపీ నేతలు అవాకులు చెవాకులు మానుకోవాలని హెచ్చరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసే తాను ప్రభుత్వానికి మద్దతివ్వాలని వైసీపీలో చేరినట్లు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: