తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ దిగ్విజయంగా పూర్తి చేసేందుకు వచ్చినట్టు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు. తనను కలిసిన తెలంగాణ నేతలతో ఆయన ఈ విషయం చెప్పారు. అంతే కాదు ఆయన హైదరాబాద్ వచ్చినప్పటినుంచి క్షణం వేస్ట్ చేయకుండా చేసిన మంత్రాంగం చూస్తే కూడా ఈ అభిప్రాయాలు బలపడుతున్నాయి. నిన్న మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ముఖ్యమంత్రి, తెలంగాణ, సీమాంద్ర కాంగ్రెస్ నేతలను కలసుకోవడమే కాకుండా ఏకంగా వారందరిని తెలంగాణ కోసం సహకరించాల్సిందిగా ఖరాఖండిగా చెప్పారని సమాచారం. దీంతో ఆయన రాకపై సీమాంద్రులు పెట్టుకున్న అనుమానాలు నిజమవుతాయోమో అన్న భావన మాత్రం కలుగుతోంది అంటున్నారు పరిశీలకులు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చకచకా పావులు కదిపారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ముందుకుపోవడాని కోసం ముఖ్యమంత్రి కిరణ్ తో చాలా సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశం మద్యాహ్నం మూడున్నర గంటలకు ముగిసింది. తెలంగాణపై వెనక్కు పోయే ప్రసక్తే లేదని, హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే అందుకు సిఎం కిరణ్ ఒప్పుకోలేదని బయటకు వార్తలు వచ్చినప్పటికి కిరణ్ ఆయనను కలవడం వెనుక మతలబు మరోటి ఉందన్న ప్రచారం జరిగింది. కారణం తెలంగాణ విషయంలో దిగ్విజయ్ సింగ్, కిరణ్ లు ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల యుద్దం చేసుకున్న విషయం తెలిసిందే. పైగా ఆయన వచ్చిందే తెలంగాణ ఏర్నాటు ప్రక్రియ ముందుకు సాగించడం కోసం. అది నేనొప్పుకోను అని కలవకుండా ఉండొచ్చు కదా అన్న అభిప్రాయాలు ఓ వైపు విన్పించగా కాంగ్రెస్ సిఎం కాబట్టి మర్యాద పూర్వకంగా కలిసారు అన్న వారు కూడా ఉన్నారు. అయితే అంత సుదీర్ఘంగా చర్చించారంటే ఏదో మతలబు ఉందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. సిఎంతో సమావేశం అయిన అనంతరం సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం రాత్రి 8 గంటల వరకు పిసిసి కార్యవర్గంతో సమావేశం అయి తెలంగాణ బిల్లుపై ఎలా ముందుకు పోవాలో దిశానిర్దేశం చేసారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ముందుకుపోయేందుకే ఆయన ఈ సమావేశాలు నిర్వహించారన్నది దీంతో సుస్పష్టం. అంతే కాదు వీరందరితో సమావేశం అయి చేయాల్సిందంతా చేసారు కాబట్టే రాత్రి గవర్నర్ ను కలిసి అంతా కథ వివరించారని అంటున్నారు, ఏం చేసారు, ఏం జరుగుతుంది అనేది తెలియడానికి ఎక్కువ సమయం లేదనుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: