టీఆర్ ఎస్ తొలి ప్ర‌భుత్వంలో రాజ‌కీయ చ‌రిష్మాతో ఓ వెలుగు వెలిగిన మాజీమంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు ప్ర‌స్తుతం పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోకూడ‌ద‌ని పాకులాడుతున్నారు. ఎమ్మెల్యే కందాల ఉంపేంద‌ర్‌రెడ్డితో కోల్డ్‌వార్ కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇద్ద‌రు నేత‌లు  త‌లో వ‌ర్గానికి ప్ర‌తినిధులుగా మారిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ‌వు అన్న సామెత మాజీ మంత్రి  తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావుకు.. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉంపేంద‌ర్‌రెడ్డికి స‌రిగ్గా స‌రిపోతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు...కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల‌పై ఓడిపోయారు.

 

ఇదీ ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోనే రాజ‌కీయ‌వేత్త‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. కేటీఆర్ తుమ్మ‌ల‌కు చెక్ పెట్టేందుకే ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులైన పువ్వాడ అజయ్‌కుమార్‌లాంటి వారికి మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నే వాద‌న జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ సాగుతోంది. అందుకే మిగ‌తా పార్టీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రొత్స‌హించి చివ‌రికి తుమ్మ‌ల‌పై గెలిచిన కందాలకు గులాబీ గూటిలో స్థానం క‌ల్పించ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని గుర్తు చేస్తున్నారు. కందాల రాక‌ను తుమ్మ‌ల అడ్డుకోవాల‌ని చూసినా సాధ్య‌ప‌డ‌లేద‌ని స‌మాచారం. పార్టీ తీసుకున్న నిర్ణ‌యాన్ని కాద‌న‌లేక‌.. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తిర‌గ‌లేక తెగ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

 

కందాలతో వ‌చ్చిన కాంగ్రెస్ నేత‌ల‌కే పార్టీ, సంస్థాగ‌త ప‌ద‌వుల నియామ‌కాల్లో పెద్ద‌పీట వేస్తున్నార‌ట‌. దీంతో తుమ్మ‌ల  వ‌ర్గం నేత‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నార‌ని స‌మాచారం. ఇలా అయితే పార్టీలో కొన‌సాగ‌లేమ‌ని నిర్మోహ‌మాటంగా మాజీ మంత్రికి చెప్పేయ‌డంతో తుమ్మ‌ల కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.  అస‌మ్మ‌తి రూపంలో కాకుండా... పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి మాజీమంత్రి తుమ్మ‌ల ఎంతో చేశార‌ని, కేసీఆర్‌, కేటీఆర్‌తో  ఆయ‌న‌కున్న సాన్నిహిత్యంతో మ‌రిన్ని నిధులు తీసుకువ‌స్తార‌ని, అందుకు ఎమ్మెల్యే కందాల గౌర‌వంగా క‌లుపుకుపోవాల‌ని అనుచ‌రుల‌తో మీడియా ఎదుట చెప్పిస్తున్నార‌ని స‌మాచారం.

 

అయితే ఎమ్మెల్యేకు ప్ర‌తీప‌నికి ప్రొటోకాల్ ఉండ‌టం కందాల‌కు క‌ల‌సి వ‌స్తోంది. అదే స‌మ‌యంలో తుమ్మ‌ల అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వాల‌కు స్వ‌త‌హాగా దూరంగా ఉంటున్నార‌ట. ఆయ‌న వ‌ర్గానికి పిలుపు కూడా క‌రువైంద‌ని తెలుస్తోంది. తుమ్మ‌ల త‌న వ‌ర్గీయుల‌తో ఇటీవ‌ల స‌మావేశం అయిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ ప‌దవుల విష‌యంలో త‌మ వ‌ర్గానికి అన్యాయం జరుగుతోంద‌ని, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో అభివృద్ధి ప‌నులు తామే చూసుకుంటామ‌ని తీర్మానించుకున్నార‌ట‌. మ‌రి తుమ్మ‌ల భేటీ విష‌యం ఇప్ప‌టికే అధిష్ఠానం దృష్టికి వెళ్ల‌గా...తుమ్మ‌ల ఏం విన్న‌వించ‌బోతున్నారు...కందాల వ‌ర్గంతో పాటు మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గం నేత‌లు ఏం స‌మాధానం చెప్ప‌బోతున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: