ప్రస్తుత కాలంలో మానవుడు సాంకేతికంగా ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుతున్నప్పటికీ ప్లాస్టిక్ వంటి భూతంతో మన భూమికి కొంత చేటు చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కొంతవరకు మాత్రమే పరిమితం అయిన ఈ ప్లాస్టిక్ వినియోగం, రానురాను మరింతగా విస్తరించింది. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ పరిశ్రమలపై ఎందరో ప్రజలు ఆధారపడి జీవిస్తుండడంతో, ప్రభుత్వాలు కూడా పూర్తిగా వీటిపై ఇప్పటికిప్పుడు నిషేధం విధించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మెల్లగా కొద్ది కొద్దిగా మనమే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ వెళితే, రాబోయే కొన్నేళ్లలో ప్లాస్టిక్ చాలావరకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు పర్యావరణ నిపుణులు. 

 

అయితే గత కొద్దిరోజలుగా ఈ ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా కొందరు నాయకులు మరియు ప్రజలు తమ వంతుగా నిషేధిస్తూ, వాటి స్థానంలో పేపర్, జనపనారతో చేసిన వస్తువులు వినియోగిస్తున్నారు. కాగా నిన్న, ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి నియోజకవర్గ ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తన నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు తనవంతుగా జనపనారతో చేసిన సంచులను ఇంటిటిటికీ తానే స్వయంగా వెళ్లి పంచడం జరిగింది. అయితే ఆయన పంచిన సంచులపై ప్రచారం మాదిరిగా వైసిపి పార్టీకి చెందిన ఎటువంటి గుర్తులు లేకపోవడం విశేషం అని అంటున్నారు స్థానిక ప్రజలు. 

 

ఇక ఈ ఘటనను వీడియో తీసిన అక్కడి కొందరు ప్రజలు, ఆ వీడియోని యూట్యూబ్ వంటి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టడం జరిగింది. ఆయన ఎమ్యెల్యే అనే విషయాన్ని ప్రక్కన పెడితే, సగటు మనిషిగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తన వంతుగా ప్లాస్టిక్ నిర్మూలనకు నడుంకట్టి చేపట్టిన ఆ గొప్ప పనికి పలువురు స్థానిక ప్రజలతో పాటు నెటిజన్లు సైతం ఆయనపై పొగడ్తలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కావున మనం ప్రతి ఒక్కరం కూడా ప్లాస్టిక్ నిషేధంపై నడుం బిగించి, వాటి వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: