తలచింది ఒకటి.. జరిగింది అన్నట్టు తయారైంది తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల పరిస్థితి. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని.. అదే మెయిన్ డిమాండ్ తో సమ్మెకు వెళ్లాయి కార్మిక సంఘాలు. 2014 తరహాలో సమ్మె ఉదృతం చేస్తే.. కేసీఆర్ తమ డిమాండ్లు అంగీకరిస్తారని భావించారో ఏమో కానీ.. ఈసారి కేసీఆర్ ఛాన్స్ తీసుకోకుండా తన ప్రతాపం చూపారు. దీంతో.. ఆశ్చర్యపోవడం కార్మిక సంఘాల వంతైంది.  కేసీఆర్ స్టాండ్ గతంలో జయలలిత తీసుకున్న స్టాండ్ ను పోలి ఉంది.

 

 

తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ ఇలా రివర్స్ బ్రేక్ వేస్తారని భావించి ఉండరు. ఆర్టీసీనే లేకుండా చేస్తానన్న సీఎం ప్రకటనతో విస్తుపోవడం కార్మికుల వంతైంది. రవాణా శాఖ మంత్రిగా తనకు తెలిసిన చట్టాలను, పరిస్థితులను వివరించేప్పటికి.. పరిస్థితులు చేయి దాటిపోయిన పరిస్థితుల్లో సమ్మె కొనసాగించారు. డెడ్ లైన్లు, కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వడం, యూనియన్లు లేని ఆర్టీసీ వంటి నికార్సైన నిర్ణయాల దగ్గర నుంచి.. కార్మిక సంఘాలే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని పక్కకు పెట్టేలా.. తమను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలనేలా పరిస్థితులు వచ్చేశాయి. ఈ సమ్మె నేపథ్యంలో మధ్యలో పోయింది పలు రాజకీయ పార్టీలే.

 

 

ఎక్కడా యూనియన్లకు తలొగ్గలేదు. ఢీ అంటే ఢీ అన్నారు. పరిష్కారం కోసం హైకోర్టు గడప తొక్కాల్సి వచ్చిందే కానీ ప్రభుత్వాన్ని ఒప్పించలేక పోయారు కార్మికులు. కార్మిక సంఘాల డిమాండ్లు వారి పరిధిలో న్యాయమైనవే అయినా పండుగ సమయంలో స్ట్రైక్ కు వెళ్లడం కేసీఆర్ ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. మొత్తానికి.. అనేక బాధాకర సంఘటనల మధ్య సమ్మె ఓ కొలిక్కి వచ్చినట్టైంది. గతంలా ఆర్టీసీని నడిపే పరిస్థితి లేదంటున్నారు సీఎం. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పుతో ఆర్టీసీపై ఓ నిర్ణయానికి రానున్నారు సీఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: