ఆ రెండు పత్రికల  ముచ్చట ఈనాటిది కాదు, దానికి పుష్కర కాలం చరిత్ర ఉంది. ఏపీలో వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా  రెండు తెలుగు పత్రికలు రాయడంతో నాటి సీం వైఎస్సార్ స్వయంగా అసెంబ్లీలో ఆ రెండు పత్రికల గురించి గట్టిగానే నిలదీశారు. మీరు చెప్పినట్లుగానే పాలన సాగుతుందా. సాగదు, మీరు ప్రజలకు నిజాలు చెప్పడంలేదు, అందుకే కొత్త పత్రికలు అవసరం అని కూడా అన్నారు. అలా ఒక కొత్త పత్రిక ఏపీలో పురుడు పోసుకుంది. ఇది గతం.

 

ఇపుడు కూడా ఆ రెండు పత్రికలు ఏపీ  రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ రెండు పత్రికల బారిన వైసీపీ సర్కార్ ఇపుడు పడుతోంది. ఇక పత్రికల మీద ఆంక్షలు  పెడుతూ ఓ జీవో తేవడానికి కూడా ఆ రెండు పత్రికలు కారణం అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే పార్లమెంట్ లో కూడా ఆ రెండు తెలుగు  పత్రికల వ్యవహారం గురించి ఒక ఎంపీగా విజయసాయిరెడ్డి నిలదీస్తున్నారు.
 .

 

తాజాగా జరిగిన అఖిల పక్ష సమావేశంలో తనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లాస్ తీసుకున్నారని తప్పుడు రాతలు రాసిన ఆ రెండు తెలుగు పత్రికలను పార్లమెంట్ హౌస్ లోకి అడుగుపెట్టకుండా బ్యాన్ చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కనీసం పత్రికా విలువలు పాటించకుండా తనను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లు రాసిన రాతల వల్ల తన ఇమేజ్  డ్యామేజ్ అయిందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

 

దీని మీద ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో  పాటు సభాహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఆ రెండు పత్రికలు పార్లమెంట్ ప్రతిష్టకూ కూడా భంగం కలిగేలా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందువల్ల వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే తప్పుడు వార్తలు రాసిన  ఆ పత్రికల రిపోర్టర్లపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. మొత్తానికి వైసీపీకి అధికారం రావడంతోనే ఆ రెండు పత్రికలకు కూడా స్థాయి పెరిగిందేమో, పార్లమెంట్ లో ప్రతిద్వనిస్తోంది వాటి గొడవ, రాధ్ధాంతం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: