మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇటీవల ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాలని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. అప్పట్లో ఈ కేసు విషయంలో హైకోర్ట్ విచారణ నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఆ స్టే పై ఎటువంటి పోదిగింపూ లేకపోవడంతో విచారణ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు జడ్జి సోమవారం ఉత్త్తర్వులు జారీ చేశారు. లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని సూచిస్తూ కేసును ఈ నెల 25 వ తేదీకి వాయిదా వేశారు.

 

అయితే ఈ కేసు గురించి చంద్రబాబును వివరణ అడిగితే షాకింగ్ రిప్లయ్ ఇచ్చారు. కేసు వేస్తే ఆధారం ముఖ్యం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్మీపార్వతి తనపై వేసిన ఆస్తుల కేసు గురించి ఆయన స్పందించారు. ‘ఎవరో ఒకరు కేసు వేస్తుంటారు. కానీ దానిలో ఆధారాలు ముఖ్యం. ప్రతిచోటా కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. నా జీవితం తెరిచిన పుస్తకం. ఏటా ఆస్తులు ప్రకటిస్తున్నాను. నలభై ఏళ్లుగా వాస్తవాలే చెబుతున్నాను. నేనెందుకు భయపడాలి? వైఎస్‌ఆర్‌ హయాంలోనే 27 కేసులు వేశారు. ఏమైంది..? ప్రజాజీవితంలో నిబద్ధత ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

అసలు ఈ కేసు పూర్వాపరాలేంటంటే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అక్రమాస్తులు కూడబెట్టారని, వాటిపై విచారణ జరిపించాలనీ లక్ష్మీపార్వతి ఆరోపిస్తూ.. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపించాలని కోరుతూ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే, చంద్రబాబు దీనిపై ఇంప్లీడ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు కు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు అక్కడ ఊరట లభించింది. 2005లోనే స్టే విధించారు. ఈ స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచీ ఈ కేసులో స్టే కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: