ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ రాయలసీమలో హైకోర్టు మరియు రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్ ఇంటిని ముట్టడించాలని కర్నూలు జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం ఆందోళన తీవ్రతరం కావటంతో యూనివర్సిటీ దగ్గర భయంకరమైన వాతావరణం కనిపించింది. 
 
విద్యార్థి సంఘాలు సీఎం జగన్ ఇంటిముట్టడికి పిలుపునివ్వటంతో పోలీసులు 200 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రాయలసీమ యూనివర్సిటీ దగ్గర అధికారులు భారీగా భద్రతా బలగాలను 
మోహరించారు. రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాలు 3 నెలల నుండి కర్నూలులో హైకోర్టు కోసం, రాజధాని కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
విద్యార్థి యువజన సంఘాల జాక్ ఛైర్మన్ మాట్లాడుతూ రాయలసీమ అస్థిత్వం కోసం నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. రాయలసీమ వెనుకబాటుతనంపై ఏ రాజకీయ పార్టీ నోరు మెదపటం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాయలసీమపై రవ్వంత అయినా అభిమానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేనపార్టీ కూడా రాయలసీమపై వివక్ష చూపుతున్నాయని ఇది చాలా దుర్మార్గం అని అన్నారు. 
 
రాయలసీమ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతోందని ప్రతిపక్షాలు కూడా రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు సీఎం జగన్ ఇంటిముట్టడికి పిలుపునివ్వటం సీఎం జగన్ కు షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నట్లు రాజధానిని నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ప్రభుత్వం డిసెంబర్ నెలలో రాజధాని, హైకోర్టు గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: