తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న టీఎస్ ఆర్టీసి పై ఆ శాఖ మంత్రి మరియు అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ముఖ్యమంత్రి "ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబరు మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌కు రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 

కాలం చెల్లిన 2,600 బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వానికి కూడా భరించే పరిస్థితి లేదు. ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు నిలబడగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు ఛార్జీలు పెంచడం. ఛార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథాతథంగా నడపడం సాధ్యం కాదు" అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. 

ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసి ని ప్రైవేటీకరణ చేస్తే తప్ప నష్టాల నుంచి బయటకు రావడం కష్టం అని తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసి కార్మికుల సమ్మె ఆర్టీసి కొంప ముంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని, అప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హై కోర్టు తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: