సమస్యలకు మూలం మనిషి ఆలోచనలే. సమస్యను సృష్టించడం తేలికే గాని సమస్యకు పరిష్కారం చూపించడం అనుకున్నంత తేలిక కాదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో మనిషి పుట్టిస్తున్న సమస్యలకు అనుగుణంగా పరిష్కార మార్గాలను కనుగొనలేకపోతున్నాడు. దీని వల్ల తను ఎంతగా నష్టపోతున్నాడో గుర్తించలేని స్దితిలో ఉన్నాడు.

 

 

ఇకపోతే చిత్తశుద్ధి లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టలేక ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోకుండా ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా నగర, పురపాలికల్లో చెత్త గుట్టల్లా పేరుకుపోతోంది. రకరకాల క్రిమి కీటకాలకు ఆశ్రయమిస్తోంది. పర్యావరణానికి పొగ పెడుతోంది. ప్రతి దారిలో మురుగు పరుగులు తీస్తోంది. జలవనరులను కలుషితం చేస్తోంది. ప్రజాఆరోగ్యాన్ని కబళిస్తోంది. పురపాలనలో నిర్లక్ష్యం వెనుక ఉదాసీనత, అవినీతి మాటేసి ఉన్నాయి. ప్రాణాంతక రోగాలకు మూలమైన దోమలు విజృంభిస్తున్నా మొక్కుబడి చర్యతో మున్సిపాలిటీలు చేతులు దులిపేసుకుంటున్నాయి.

 

 

నిత్యం ఉత్పత్తయ్యే చెత్తను పూర్తిగా తొలగించకపోవడం ఒక సమస్య అయితే సేకరిస్తున్న చెత్తను పట్టణాలకు సమీపంలోని డంపింగ్‌ యార్డుల్లో ఇష్టారాజ్యంగా పారబోస్తుండటం మరో సమస్యగా మారింది. దీనివల్ల ఆ చుట్టుప్రక్కల నివాసముండే ప్రజలలు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కావూ. ఆ చెత్త నుండి వచ్చే వాసన, దీనికితోడు వాతావరణ కాలూష్యం. అక్కడి వారికి లేనిపోని రోగాలను తెచ్చి పెడుతుంది. ఇకపోతే చెత్తకు పరిష్కారం చూపుతాయనుకున్న డంపింగ్‌ యార్డులే అసలు సమస్యగా మారుతున్నాయి. నగరాలు, ప్రధాన పట్టణాలు అన్నింటికీ దాదాపుగా ఇవి ఉన్నా శాస్త్రీయ నిర్వహణ లేక దుర్గంధం వ్యాపిస్తోంది. వరంగల్‌లోని యార్డుకు రోజూ 220-230 టన్నుల చెత్త చేరుతుండగా ఏడేళ్లుగా వ్యర్థాలు పేరుకు పోయాయి. కరీంనగర్‌ బైపాసురోడ్డులోని యార్డు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారింది.

 

 

ఖమ్మంలో పదెకరాల్లో యార్డున్నా చెత్తను రహదారి వెంటే పోస్తున్నారు. నిజామాబాద్‌ శివారులో డంపింగ్‌ యార్డున్నా అభివృద్ధి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. సంగారెడ్డిలో నేటికీ డంపింగ్‌యార్డు లేదు. నగరానికి దగ్గరలో ఉన్న జవహర్ నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డ్ వల్ల నిత్యము దుర్గందమైన వాసన ఇక్కడున్న ప్రజలను ఉక్కురి బిక్కిరి చేస్తుంది. ఇప్పటికే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ఆ చుట్టుప్రక్కలి భూమిలో ఉన్న వాటర్ కూడా కలుషితమవ్వగా ప్రజలు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్దితి ప్రతి చోట కనిపిస్తుంది. పాలకులు ఎన్నికల సమయంలో ఎన్నో హమీలు ఇస్తారు కాని అవి నెరవేర్చడంలో విఫలమవుతారు.

 

 

ఇదే కాకుండా నగరాలు, పట్టణాలను నిత్యం కోట్ల లీటర్ల మురుగునీరు ముంచెత్తుతోంది. హైదరాబాద్‌లో నిత్యం వెలువడే మురుగు నీటిని 50 శాతం వరకూ శుద్ధి చేస్తుండగా.. కరీంనగర్‌లో రెండు ఎంఎల్‌డీల వరకూ మురుగునీరు శుద్ధి అవుతోంది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన వరంగల్‌తో పాటు ఖమ్మం, నిజామాబాద్‌, మిగిలిన పట్టణాల్లో మురుగునీటి శుద్ధి మాటే లేదు. ఇలాంటి దుస్దితి కనిపించినప్పుడలా పాలన పడకేసిందా అనిపిస్తుంది. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో జీవించే వారి ప్రాణాలు గాల్లో దీపంలాగా ఉంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందింగా ఎందరో బాధితులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: