దేశవ్యాప్తంగా మొత్తం 6,83,823 ఖాళీలున్నాయని, 4,08,591 పోస్టులకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయని 
రాజ్యసభకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ గురువారం (నవంబరు 21) లిఖితపూర్వకంగా ఖాళీల వివరాలను వెల్లడించారు. 

2017-18లో గ్రూప్‌-సి, లెవల్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి 'సెంట్రలైజ్డ్‌ ఎంప్లాయిమెంట్‌ నోటిఫికేషన్స్‌(సీఈఎన్‌)' కింద రైల్వే మంత్రిత్వ శాఖ 1,27,573 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిందని.. ఈ రెండేళ్లలో ఖాళీల సంఖ్య మరింత పెరిగిందని తెలిపారు. 2018-19లో గ్రూప్‌-సి, లెవల్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించిన 1,56,138 ఖాళీల భర్తీకి సీఈఎన్‌ మరో నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఆయన గుర్తు వెల్లడించారు. మరోవైపు దాదాపు 19,522 గ్రేడ్‌ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌ కూడా పరీక్షలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ఇవన్నీ కలిపి దాదాపు 4,08,591 ఖాళీల భర్తీకి ఎస్సెస్సీ, ఆర్‌ఆర్బీ, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ నోటిఫికేషన్లు జారీ చేశాయని, భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.

త్వరితగతిన ఉద్యోగాల భర్తీకి వీలుగా.. నియామక ప్రక్రియ సమయాన్ని తగ్గించడానికి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించామని, ఈ ప్రక్రియ జనవరి 1, 2016 వరకు కొనసాగిందని తెలిపారు. ఉద్యోగార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ప్రొవిజనల్‌ నియామక పత్రాల జారీ లాంటి అంశాలు పెండింగులో ఉన్నట్టు కేంద్ర మంత్రి జితంద్ర సింగ్ తెలిపారు.

సభలో సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ సమాధానామిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు సంబంధించి వివిధ శాఖల్లో బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు పనిచేసే పది మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్‌లాగ్‌ రిజర్వుడ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో నిపుణులను నియమించే లేటరల్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అప్పటికే విధుల్లో ఉన్న అధికారులు ఈ తరహా నియామకాలతో వివక్షకు లోనుకాబోరని మంత్రి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: