తెలుగుదేశం పార్టీని నందమూరి నుంచి నారా వైపునకు లాగడమే కాదు. దాన్ని శాశ్వతం చేయాలన్నది చంద్రబాబు రాజకీయ వ్యూహం. అందుకే తన ఏకైక‌ కుమారుడు నారా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు  బాబు రెడీ అయిపోయారు. ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలు లేవు. లోకేష్ టీడీపీ  భావి వారసుడు. అందువల్ల పార్టీలో ఉండాలనుకుంటున్న వారు ఉండవచ్చు, లేని వారు వెళ్ళిపోవచ్చు. దాంతోనే కొంతమంది తమ్ముళ్ళు ఎదిరించి బయటకు వస్తున్నారు. మరికొంతమంది తమ్ముళ్ళు లోలోపల సణుక్కుంటూ టైం కోసం ఎదురుచూస్తున్నారు.

 

ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీయార్ హ్యాంగోవర్ టీడీపీని గట్టిగానే  పట్టి కుదుపుతోంది. నిజానికి జూనియర్ 2009 తరువాత పార్టీ వైపు చూసింది లేదు. వచ్చింది లేదు. కానీ టీడీపీలో ఇపుడు జూనియర్ హాట్ టాపిక్ అయిపోయాడు. జూనియర్ రావాలి అంటూ పెద్ద గొంతులే వినిపిస్తున్నాయి. పార్టీకి భావి వారసుడుగా లోకేష్ ఉండగా జూనియర్ గోల ఏల అని అధినాయకుడు  బాబు అంటున్నా కూడా పదికాలాల పాటు పచ్చగా పసుపు పార్టీ ఉండాలంటే జూనియర్ పొలిటికల్ ఎంట్రీ తప్పనిసరి అని తమ్ముళ్ళు అంటున్నారు.

 

ఇక జూనియర్ సైతం రాజకీయాలపైన ఆసక్తిని కనబరుస్తున్నారని టాక్. రావడం ఖాయం, అయితే అది ఎపుడు అన్నదే ఇపుడు సస్పెన్స్.  ప్రస్తుతానికి ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. 2024 వరకూ మళ్ళీ ఆ వూసు లేదు. అందువల్ల జూనియర్ ఇపుడు సినిమాల్లోనే బిజీగా ఉంటున్నారు. ఆయన ఎంట్రీ 2024 లో ఉండొచ్చని ఒక మాట వినిపిస్తోంది. ఒకవేళ  కుదరకపోతే మాత్రం 2029 నాటికి పక్కా అంటున్నారు.

 

జూనియర్ కూడా తాను చేయాల్సిన సినిమాలు, పాత్రలు ఇవన్నీ మరో పదేళ్ళలోగా  పూర్తి చేసుకుంటారని, ఇక్కడ మామ చంద్రబాబు, బావ లోకేష్ ల గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటాడని అంటున్నారు. టీడీపీలో లోకేష్ నాయకత్వం ఫెయిల్ అన్నది పూర్తిగా రుజువు అయితే జూనియర్ ఏ సమయంలోనైనా కూడా  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయట. అపుడు అది 2024లో   జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరంలేదని అంటున్నారు. 

 

మొత్తానికి జూనియర్ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఇప్పటికైతే కొన్నాళ్ళు వాయిదా మాత్రమే అంటున్నారు. ఒకవేళ రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారి రావడం అనివార్యమే అయితే మాత్రం జూనియర్ బరిలోకి దిగిపోతారని అంటున్నారు. అపుడు కొత్త పార్టీ పెట్టైనా సరే రాజకీయ ప్రవేశం కచ్చితంగా ఉంటుందని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీకి జూనియర్ ఫియర్ అలాగే  ఉంచడంలో మాత్రం చిన్న ఎన్టీయార్ సక్సెస్ అయ్యాడనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: