భూమా కుటుంబంలో మరోసారి రచ్చ మొదలైందా ? ఇదే అనుమానం అందరిలోను మొదలైంది. ఇప్పటి వరకూ రాజకీయ ఆధిపత్యం కోసమే భూమా కుటుంబంలో గొడవలు జరిగాయి. ఇపుడు ఆస్తుల విషయంలో కూడా ఒకరిపై మరొకరు కోర్టులో కేసులు వేసుకునే దాకా పరిస్ధితి దిగజారిపోయింది.   కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో అంతా తానై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

అఖిల ఒంటెత్తు పోకడలు నచ్చని చాలామంది టిడిపి నేతలు పార్టీకే దూరమైపోయారు. పార్టీలోనే ఉన్న మరి కొంతమంది నేతలు మొన్నటి ఎన్నికల్లో భూమా కుటుంబానికి పూర్తిగా వ్యతిరేకం చేశారు. సరే కారణాలు ఏవైనా మొత్తానికి అఖిలతో పాటు సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఓడిపోయారు.

 

అంతా ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కొందరు బిజెపిలోకి మరికొందరు వైసిపిలోకి వెళ్ళిపోయారు. సరే ఆ విషయాలను పక్కన పెడితే తాజాగా అక్కలు అఖిలప్రియ, మౌనిక మీద తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేయటం జిల్లాలో సంచలనంగా మారింది. మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న ఓ స్ధలం అమ్మకానికి సంబంధించి తన దగ్గర వేలిముద్రలు వేయించుకుని అక్కలు మోసం చేశారంటూ కేసు వేశాడు.

 

అంటే అప్పట్లో జగన్ మైనరట. దాన్ని సాకుగా చూపి తన వేలిముద్రలు వేయించేసుకుని సదరు భూమిని అమ్మేసుకుకున్నారని కోర్టులో జగత్ పిటీషన్ వేశారు.

 

అఖిల మంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆమెతో పాటు ఆమె భర్తపైన ఎన్నో ఆర్ధిక పరమైన ఆరోపణలొచ్చాయి. మంత్రి తరపున భర్తే చాలా వ్యవహారాలు చక్కబెట్టేవాడనే ఆరోపణలు ఇప్పటికీ జిల్లాలో వినిపిస్తుంటాయి. ఆర్ధిక వ్యవహారాల ఆరోపణలు, రాజకీయ ఆధిపత్య గొడవలుండగానే తాజాగా ఆస్తి తగాదాలు కూడా తోడయ్యాయి. అయితే అంతా కలిసి డ్రామాలాడుతున్నారనే ప్రచారం కూడా మరోవైపు జరుగుతోంది. మరి ఏది నిజమో తెలియాలంటే కోర్టులోనే తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: