ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో దాదాపు 100 రోజుల నుంచి ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీని వలన ఇసుక కొరత ఏర్పడటం దాని  ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. నిర్మాణాలు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఉపాధి కరవు అవ్వడం తో కొందరు  బలవన్మరణాలకు పాల్పడ్డారు .

 

అంతేకాదు, ఇసుక ధరలు కొండెక్కి కూర్చున్నాయి.దీనిపై ప్రతిపక్షాలు అధికార పక్షం పై విరుచుకుపడ్డాయి .ఇప్పుడిపుడే ఇసుక ఒక కొలిక్కి వస్తోంది . గత మూడు నెలలపాటు నదుల్లో వరద నీరు పారుతుండటంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వారం రోజులుగా వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇసుక భారీగా లభ్యమవుతోంది. ఇసుక ప్రస్తుతం స్టాక్‌ యార్డుల నిండా నిల్వలున్నాయి.

 

అంతేకాదు రాబోయే మూడేళ్ళవరకు సరిపడా ఇసుక మేటలు నదుల్లోకి వచ్చాయి. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు.13 జిల్లాల పరిధిలో ఇచ్చినదానికంటే కూడా అదనంగా 34 స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు.కాగా ఇసుకను ప్రభుత్వమే అమ్ముతుండటంతో రోజుకు రెండు కోట్ల రూపాయలు పైగానే ఆదాయం వస్తోంది. అయితే గురువారం 2,82,224 టన్నుల ఇసుక అందుబాటులో ఉంటే.. 71,735 టన్నులు మాత్రమే బుక్ అయింది. దాంతో ఈ ఒక్కరోజే ఏకంగా రూ. 3 కోట్ల 42 లక్షలు ప్రభుత్వానికి ఆదాయం రావడం విశేషం.

 

ఇక అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయం లాంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది. అంతేకాదు అక్రమంగా ఇసుక తవ్వకాలు,నిలువరించేందుకు ఆ దిశగా చర్యలు చేపడుతోంది . అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: