చివరకు  తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయం లో ఒక ముగింపు వచ్చింది అనుకునే లోపు కథ ..మొత్తం మళ్లీ మొదటికి వచ్చింది.  తమపై ఎటువంటి కండీషన్లు లేకుండా  విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ రెండు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనతో ఆర్టీసీ యూనియన్లలో విబేధాలు బయటకు వచ్చాయి .

 

ఇక తాజాగా మరోమారు యూ టర్న్ తీసుకున్న ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.ఇదే సమయంలో కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వెళ్లినా..ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోవటంతో వారి అక్కడే పడిగాపులు పడుతున్నారు. దీంతో..మరోసారి సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెను యధాతధంగా కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు.

 

కార్మికులు ఎవరూ డిపోలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పట్టించుకోక పోవటంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా అశ్వద్దామ రెడ్డి స్పష్టం చేసారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండానే సమ్మె విరమణ ఆలోచన ఆర్టీసీ కార్మికులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో డ్రైవర్ వీర భద్రయ్య ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని,తమ  ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలియటం లేదు  ఆర్థిక పరిస్థితి ఏమిటి అని తీవ్ర మనోవేదనకు గురై మరణించాడు.

 

దీంతో ఆర్టీసీ కార్మికులు పరిగి డిపోలోకి శవంతో పాటు చొచ్చుకువెళ్ళారు. అక్కడే శవాన్ని ఉంచి ఆందోళన కొనసాగిస్తున్నారు.తీవ్ర ఆగ్రహావేశాలతో కార్మికులు ఊగిపోతున్నారు. ఇంతమంది కార్మికులు మరణిస్తున్నా చలనం లేని సీఎం తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు.

 

దీంతో వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళన కారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వ తీరు మారకపోవటం, మరోపక్క ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు, ఇంకొక వైపు ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆర్టీసీ కార్మిక లోకాన్ని బాగా టెన్షన్ పెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: